కేసీఆర్‌ కత్తికి రెండువైపులా పదునే!

December 19, 2019


img

కేసీఆర్‌ కత్తికి రెండువైపులా పదునేనని ఇప్పటికే అనేకసార్లు నిరూపితమైంది. ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టం (క్యాబ్) విషయంలో మరోసారి నిరూపితమైంది. దానిపై దేశంలో పలురాష్ట్రాలలో ఉదృతంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ముస్లింలు ఎక్కువగా ఉండే రాష్ట్రాలలో ఆందోళనలు జరుగుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. తెలంగాణలో కూడా హైదరాబాద్‌తో సహా పలు జిల్లాలలో ముస్లింలు ఆందోళనలు నిర్వహించారు. హైదరాబాద్‌ యూనివర్సిటీ, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్దులు క్యాబ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. కానీ ఎక్కడా పరిస్థితులు అదుపు తప్పలేదు. దేశంలో ఇతర రాష్ట్రాలలో ఆందోళనకారులను అడ్డుకోవడానికి పోలీసులు, పారా మిలటరీ దళాలను మోహరించి పరిస్థితులను అదుపు చేస్తుంటే, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పోలీసుల పాత్ర చాలా నామమాత్రంగానే ఉండటం విశేషం. 

ఇదెలా సాధ్యమైంది? అంటే పార్లమెంటులో తెరాస ఎంపీల చేత క్యాబ్‌ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయించడం వలననే అని చెప్పవచ్చు. తద్వారా తమ ప్రభుత్వం రాష్ట్రంలో ముస్లింలకు అండగా నిలబడుతుందని సిఎం కేసీఆర్‌ వారికి బలమైన సందేశం ఇవ్వగలిగారు. అదీగాక తెరాస ప్రభుత్వానికి మజ్లీస్ మద్దతు అవసరం లేనప్పటికీ ఓవైసీలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వారితో దోస్తీని కొనసాగిస్తుండటం ద్వారా వారి వలన తెరాస సర్కార్‌కు ఇబ్బంది కలిగించకుండా నివారించుకోగలిగారు. అందుకే క్యాబ్‌ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టాలని మజ్లీస్ నేతలు ముస్లింలకు పిలుపునివ్వలేదు. అలాగే రాష్ట్రంలో ముస్లింలు శాంతియుతంగా నిరసనలకే పరిమితమయ్యేలా మజ్లీస్ పార్టీ అన్ని జాగ్రత్తలు తీసుకొంది. కనుక క్యాబ్‌ అంశంపై పోలీసుల కంటే మజ్లీస్ సహకారంతోనే ఆందోళనలు ఉదృతం కాకుండా, అదుపు తప్పకుండా తెరాస సర్కార్‌ నివారించగలిగిందని చెప్పవచ్చు.

ఇంకా గొప్ప విశేషమేమిటంటే బద్ధ శత్రువులైన మజ్లీస్, బిజెపిలు రెంటినీ ఆయన స్నేహంతోనే నియంత్రిస్తుండటం! ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులతో సఖ్యత కొనసాగిస్తుండటం ద్వారా రాష్ట్రంలో బిజెపి విశ్వసనీయతను దెబ్బతీసి దానిని ప్రజలు నమ్మకుండా చేయగలిగారు. ఓవైసీలతో స్నేహంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పకుండా చేసుకోగలుగుతున్నారు. పైగా మజ్లీస్ పార్టీని హైదారాబాద్ కే పరిమితం చేసి రాష్ట్రంలో జరిగిన ప్రతీ ఎన్నికలలో ముస్లింలు తెరాసకే ఓట్లు వేసేలా చేసుకోగలుగుతున్నారు. అంటే సిఎం కేసీఆర్‌ కత్తికి రెండువైపులా పదునేనని అర్ధమవుతోంది. 


Related Post