ఇప్పుడు తెరాస వంతు!

December 18, 2019


img

లోక్‌సభ ఎన్నికలప్పుడు పసుపు బోర్డు ఏర్పాటు, గిట్టుబాటు ధరల కోసం నిజామాబాద్‌ జిల్లా రైతులు పోరాటం ప్రారంభించినప్పుడు కాంగ్రెస్‌, బిజెపిలు వారికి అండగా నిలిచాయి. వారి సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన తెరాస సిట్టింగ్ ఎంపీ కవిత జరుగబోయే నష్టాన్ని గుర్తించలేదనుకోలేము. కానీ కాంగ్రెస్‌, బిజెపి నేతలే రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపణలకే పరిమితమయ్యారు తప్ప నేరుగా రైతులతో మాట్లాడి వారి సమస్యల పరిష్కారం కోసం తాను డిల్లీలో చేసిన ప్రయత్నాల గురించి వివరించే ప్రయత్నం చేయలేదు. అదీగాక రైతుల పోరాటాలను, వారికి అండగా నిలిచిన కాంగ్రెస్‌, బిజెపిల శక్తిని తక్కువగా అంచనా వేసి అతివిశ్వాసంతో ముందుకు వెళ్ళడంతో లోక్‌సభ ఎన్నికలలో బిజెపి అభ్యర్ధి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయారు. 

ఎంపీ కవితపై మండిపడుతున్న రైతులను ఆకట్టుకొని ఎన్నికలలో గెలిచేందుకు ధర్మపురి అరవింద్, తనను గెలిపిస్తే నెలరోజులలో జిల్లాలో పసుపుబోర్డు ఏర్పాటు చేయిస్తానని, మద్దతు ధరలు ప్రకటింపజేస్తానని రైతులకు బాండ్ పేపరుపై లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. కానీ 7 నెలలు గడిచినా ఇంతవరకు ఆ హామీలను నెరవేర్చలేకపోయారు. దాంతో జిల్లాలో రైతులు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు, పాదయాత్రలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. 

పసుపుబోర్డుకు బదులు మేలైన విధానం ప్రకటిస్తామని ధర్మపురి అరవింద్‌ చెప్పడాన్ని తమను మోసం చేయడమేనని రైతులు వాదిస్తున్నారు. తమను మోసం చేసిన ఆయన తక్షణం రాజీనామా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పసుపుబోర్డు ఏర్పాటుకు కేంద్రాన్ని ఒప్పించలేక, ఎంపీ పదవికి రాజీనామా చేయలేక ధర్మపురి అరవింద్‌ తలపట్టుకొంటున్నారు. ఇంతకు ముందు వారికి కాంగ్రెస్‌, బిజెపి నేతలు అండగా నిలబడి ఎన్నికలలో తెరాసను దెబ్బ కొట్టినందుకు ఇప్పుడు తెరాస నేతలు రైతులకు అండగా నిలబడి వారి ద్వారానే ఎంపీ ధర్మపురి అరవింద్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనుకోవడం సహజమే కదా?


Related Post