నిర్భయ దోషులకు వారం రోజులే గడువు

December 18, 2019


img

నిర్భయ కేసులో నలుగురు దోషులకు డెత్ వారెంట్ జారీ చేయాలంటూ నిర్భయ తల్లితండ్రులు వేసిన పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు, రాజ్యాంగం ప్రకారం వారు రాష్ట్రపతికి క్షమాబిక్ష పిటిషన్లు పెట్టుకొనేందుకు చివరి అవకాశాన్ని కల్పిస్తూ వారం రోజులు గడువు ఇచ్చింది. ఈ మేరకు తీహార్ జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై సుప్రీంకోర్టు తుదితీర్పు కాపీ కోసం ఎదురుచూస్తామని ప్రకటించి జనవరి 7కు కేసును వాయిదా వేసింది. 

అయితే వారు క్షమాభిక్ష పిటిషన్లు పెట్టుకొన్నా, పెట్టుకోకపోయినా ఉరిశిక్షలు విధించడం దాదాపు ఖాయం అయిపోయాయని చెప్పవచ్చు. అటువంటి హేయమైన నేరాలకు పాల్పడేవారు క్షమాభిక్షకు అనర్హులని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కొద్దిరోజుల క్రితం రాజస్థాన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో చెప్పారు. కనుక వారు క్షమాభిక్ష పిటిషన్లు పెట్టుకొన్నా ఆయన తిరస్కరించబోతున్నారని స్పష్టం అయ్యింది కనుక వారికి ఉరి తప్పదు. ఒకవేళ క్షమాభిక్ష పిటిషన్లు పెట్టుకోకుంటే మరికొంత ముందుగా ఉరితీయబడతారు. అంటే వారు తమ ఆయువును మరికొన్ని రోజులు పొడిగించుకోగలరు తప్ప వారి కోసమే ఎదురుచూస్తున్న మృత్యువును తప్పించుకోలేరని స్పష్టం అవుతోంది. దోషులలో ఒకడైన అక్షయ్ కుమార్ సింగ్ వేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈరోజు నిర్ద్వందంగా కొట్టివేసింది. ఇకముందు వేయబోయే పిటిషన్లను కూడా అలాగే తిరస్కరించబోతున్నట్లు స్పష్టమైన సంకేతం ఇచ్చింది. కనుక నిర్భయ దోషులకు ఇక రోజులు దగ్గర పడినట్లే! ఇంకా ఎన్ని రోజులున్నాయో వారు లెక్కపెట్టుకోగలరు అంతే!


Related Post