నిర్భయ దోషులకు ఉరే సరి: సుప్రీంకోర్టు

December 18, 2019


img

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో ఉరిశిక్ష విధించబడిన దొషులలో ఒకడైన అక్షయ్ పెట్టుకొన్న రివ్యూ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అక్షయ్ తరపు న్యాయవాది ఏపీ సింగ్ ఈ కేసును మళ్ళీ తిరగదోడేందుకు విఫలయత్నం చేశారు కానీ దోషులకు విధించిన ఉరిశిక్షపై పునః సమీక్ష అవసరం లేదని, చాలా హేయమైన నేరానికి పాల్పడిన నేరస్తులకు రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసుకొనేందుకు అర్హత కూడా లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్రవ్యాఖ్యలు చేసింది. అక్షయ్ పెట్టుకొన్న రివ్యూ పిటిషన్‌ను కొట్టివేసింది. 

అయితే సుప్రీంకోర్టులో మళ్ళీ క్యూరేటివ్ పిటిషన్‌ వేస్తానని ఏపీ సింగ్ తెలిపారు. నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలుకాకుండా ఆయన చాలా తెలివిగా ఈ కేసును సాగదీసే ప్రయత్నాలు చేస్తున్నారు. నలుగురు దోషుల తరపున ఒకేసారి రివ్యూ పిటిషన్లు వేసినట్లయితే ఒకేసారి తీర్పు వెలువడుతుంది కనుక వెంటనే ఉరిశిక్ష అమలుచేసేయవచ్చు.  కనుక ముందుగా నలుగురిలో ఒకరి తరపునే ఆయన సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేశారు. దానిపై మళ్ళీ క్యూరేటివ్ పిటిషన్‌ కూడా వేస్తానని చెపుతున్నారు. దానిపై కూడా విచారణ పూర్తయిన తరువాత మరో దోషి తరపున రివ్యూ, క్యూరేటివ్ పిటిషన్లు వేస్తారు. ఆవిధంగా నలుగురు దోషుల ఆయువు మరో రెండుమూడు వారాలు పెంచగలరేమో కానీ వారికి ఉరిశిక్ష పడకుండా కాపాడలేననే సంగతి ఆయనకు కూడా తెలుసు. 

వారికి డెత్ వారెంట్ జారీ చేయాలని కోరుతూ నిర్భయ తల్లితండ్రులు వేసిన పిటిషన్‌పై ఇవాళ్ళ మధ్యాహ్నం డిల్లీ హైకోర్టు నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. వారికి ఉరిశిక్ష అమలుచేయడానికి తీహార్ జైలు అధికారులు సిద్దంగా ఉన్నారు.    కానీ ఈ కోర్టు పిటిషన్లు, క్షమాభిక్ష పిటిషన్ల కధలన్నీ ముగిస్తేగానీ నలుగురికి ఉరిశిక్ష అమలుచేయలేరు. ఈ తతంగమంతా పూర్తవడానికి మరో రెండు మూడు వారాలు పడుతుందేమో?


Related Post