తెలంగాణ కాంగ్రెస్‌, బిజెపిలకు కొత్త సారధులు ఎవరో?

December 18, 2019


img

తెలంగాణలో 2వ స్థానం కోసం పోటీపడుతున్న కాంగ్రెస్‌, బిజెపిలకు ఇంచుమించు ఒకే సమయంలో కొత్త అధ్యక్షుల నియామకం జరుగబోతుండటం చాలా ఆసక్తికరమైన విషయమే. రెండు పార్టీల లక్ష్యం వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెరాసను ఓడించి రాష్ట్రంలో అధికారంలోకి రావడమే. కానీ రాజకీయంగా బలపడిన తెరాసను డ్డీకొని ఓడించి అధికారం చేజిక్కించుకోవడం అంత సులువు కాదనే సంగతి అందరికీ తెలుసు. కనుక అంత సమర్దుడైన నాయకుడిని వెతికిపట్టుకొని పార్టీ పగ్గాలు అప్పగించవలసి ఉంటుంది.   

రెండు అసెంబ్లీ ఎన్నికలలో పిసిసి అధ్యక్షుడుగా పార్టీని నడిపించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తెరాసకు గట్టి పోటీ ఇవ్వగలిగారు కానీ రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తేలేకపోయారు. ఎన్నికలలో గెలిచిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తెరాసలో వెళ్ళిపోకుండా కాపాడుకోలేకపోవడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఈ పరిస్థితులలో కూడా పగ్గాలు చేపట్టేందుకు పార్టీలో పలువురు పోటీ పడుతుండటం విశేషమే. వి.హనుమంతరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి,  రేవంత్‌ రెడ్డి, శ్రీధర్ బాబు అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. కాంగ్రెస్‌ అధిష్టానం వారిలో ఎవరికి పార్టీ పగ్గాలు అప్పగిస్తుందో త్వరలోనే తేలిపోతుంది.

రాష్ట్రంలో తెరాసకు తామే ప్రత్యామ్నాయమని, అసెంబ్లీ ఎన్నికలలో తెరాసను ఓడించి అధికారం చేజిక్కించుకొంటామని, మోడీ ప్రభావం ముందు కేసీఆర్‌ నిలువలేరని బల్లగుద్దివాదిస్తున్న బిజెపి రాష్ట్రంలో కనీసం 2వ స్థానం కూడా దక్కించలేకపోతోంది. ఈ ఏడాది జరిగిన ఒక్క లోక్‌సభ ఎన్నికలలో తప్ప తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి జరిగిన ప్రతీ ఎన్నికలలోను చతికిలపడుతూనే ఉంది. కనుక తెరాసను ఓడించడం మాట అటుంచి గౌరవప్రదమైన సీట్లు గెలుచుకొనేందుకైనా రాష్ట్ర బిజెపికి బలమైన నాయకుడు అవసరం చాలా ఉంది. బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవికి కె.లక్ష్మణ్‌తోపాటు, లోక్‌సభ ఎన్నికలలో కేసీఆర్‌ కుమార్తె కవితను ఓడించిన నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్, బండి సంజయ్, డికె.అరుణ, జితేందర్ రెడ్డి తదితరులు పోటీ పడుతున్నారు. వారిలో ఎవరికి పార్టీ పగ్గాలు అప్పగిస్తారో చూడాలి.


Related Post