దిశకు ముందు మరో 9మందిపై హత్యాచారాలు!

December 18, 2019


img

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు మరిన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన అరీఫ్ ఇంతకు ముందు ఆరుగురు మహిళలపై అత్యాచారాలు చేయగా, చెన్నకేశవులు ముగ్గురిపై అత్యాచారాలు చేశారనే వార్త సంచలనం సృష్టిస్తోంది. మహిళలపై అత్యాచారాలు చేసిన తరువాత వారిని హత్య చేసి వారి శవాలను పెట్రోల్ పోసి తగులబెట్టేవారని, దిశను కూడా అదేవిధంగా తగులబెట్టారని పోలీసులు తెలిపారు.

దిశ ఘటనపై పోలీసులు నిందితలను ప్రశ్నిస్తున్నప్పుడు  మృతదేహాన్ని తగులబెడితే ఆధారాలు లభించవు కనుక పోలీసులు తమను పట్టుకోలేరనుకొన్నామని ఒక నిందితుడు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అంటే గతంలో ఇదేవిధంగా హత్యాచారాలు చేసి పెట్రోల్ పోసి తగులబెట్టడం వలన పోలీసులకు పట్టుబడలేదు కనుక ఇప్పుడు దిశ కేసులో కూడా అదేవిధంగా తప్పించుకోవచ్చుననే ధీమాతోనే వారు ఈ దారుణానికి పాల్పడినట్లు అర్ధం అవుతోంది. ఎన్‌కౌంటర్‌కు ముందు జరిపిన విచారణలో నిందితులు స్వయంగా ఈ విషయాలు వాంగ్మూలంలో పేర్కొన్నారని పోలీసులు తెలిపారు. కనుక ఆ కేసులపై కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వాటి కోసం నాలుగు పోలీస్ బృందాలు రంగంలో దిగాయి. 

హాజీపూర్‌ హత్యాచారాల నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి గ్రామానికే చెందిన మైనర్ బాలికలపై అత్యాచారం చేస్తూ ఊరు చివరనున్న పాడుబడిన నూతిలో పూడ్చిపెట్టేవాడు. మూడవ బాలిక శవం కోసం వెతుకుతున్నప్పుడు మిగిలిన ఇద్దరి శవాలు దొరకడంతో హాజీపూర్‌లోనే ఉంటున్న కారణంగా శ్రీనివాస్ రెడ్డి పట్టుబడ్డాడు. అయితే దిశ నిందితులు వేర్వేరు ప్రాంతాలలో హైవేలపై మాటువేసి అటుగా వచ్చిన మహిళలపై హత్యాచారాలు చేసిన వారి మృతదేహాలు తగులబెట్టిన  తరువాత లారీలలో సరుకువేసుకొని ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతుండటం వలన ఇంతకాలం పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకోగలిగారు. కానీ దిశ హత్యాచారం తరువాత నలుగురు నిందితులు తమ స్వగ్రామానికి వెళ్ళడంతో దొరికిపోయారు. పైగా ఇప్పుడు రాష్ట్రంలో ప్రతీచోట సిసి కెమెరాలు ఏర్పాటుచేసి ఉండటంతో నిందితులు సులువుగా దొరికిపోయారు. దిశ నిందితులు పట్టుబడి ఎన్‌కౌంటర్‌ చేయబడ్డారు కనుక వారి వలన మరో మహిళ బలవలేదు లేకుంటే వారు ఇంకా ఎంతమందిని బలి తీసుకొనేవారో? ఇప్పుడు ఈ దారుణాలన్నీ ఒకటొకటిగా బయటకువస్తున్నాయి కనుక ప్రజలకు వాటి గురించి తెలుస్తోంది కానీ దేశంలో ఇటువంటి నేరస్తులు ఇంకా ఎంతమంది ప్రజల మద్య తిరుగుతున్నారో?


Related Post