ఏపీకి మూడు రాజధానులు?

December 17, 2019


img

ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే రాజధాని అమరావతి నిర్మాణ పనులు నిలిపివేసింది. రాజధాని నిర్మాణంపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ రకరకలుగా మాట్లాడుతూ ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారు. అయితే ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం దీనిపై మౌనం వహిస్తున్నారు. ఆయన ఈరోజు తొలిసారిగా రాజధాని నిర్మాణం గురించి తమ ప్రభుత్వ ఆలోచనలను బయటపెట్టారు. 

“ఏపీకి ఒకటి కాదు...మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? అనే దానిపై లోతుగా చర్చ జరగాల్సి ఉంది. అమరావతిలో పాలనపరమైన (లెజిస్లేటివ్) రాజధాని, విశాఖలో కార్యనిర్వాహక (ఎగ్జిక్యూటివ్) రాజధాని, కర్నూలులో న్యాయ (జ్యుడీషియల్)రాజధానిని పెట్టుకోవచ్చు. తద్వారా అధికార వికేంద్రీకరణ జరుగుతుంది...రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు, జిల్లాలు సమాంతరంగా అభివృద్ధి చెందుతాయి. పాలనాపరమైన రాజధాని కోసం అమరావతిలో ప్రస్తుతం ఉన్న భవనాలను ఉపయోగించుకోవచ్చు. అలాగే విశాఖ అన్ని విధాలా అభివృద్ధి చెందింది కనుక అక్కడ పెద్దగా ఖర్చు లేకుండానే కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేసుకోవచ్చు. ఉద్యోగుల సౌకర్యార్ధం ఒక మెట్రో రైల్‌ వేసుకొంటే సరిపోతుంది. ఇక కర్నూలులో జ్యూడీషియల్ రాజధాని ఏర్పాటు చేయడానికి కూడా పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. రాజధాని నగరం ఒకే చోట ఉండాలనే పాత ఆలోచనకు స్వస్తి చెప్పి మన వనరులు,  సౌలభ్యం బట్టి అవసరమైతే మూడు రాజధానులు ఏర్పాటు చేసుకోవడమే మేలని భావిస్తున్నాను. త్వరలో నిపుణుల కమిటీ నివేదిక ఇస్తుంది. దాని ఆధారంగా రాజధాని నిర్మాణంపై తుది నిర్ణయం తీసుకొంటాము,” అని ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభలో చెప్పారు.

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తన మనసులో మాటను బయటపెట్టేశారు కనుక నిపుణుల కమిటీ కూడా అందుకు అనుగుణంగానే నివేదికను తయారుచేస్తోందని భావించవచ్చు. అయితే అమరావతి నుంచే పరిపాలన సాగించాలనుకొంటున్నట్లు స్పష్టం చేశారు కనుక రాజధానిలో ఎటువంటి మార్పు ఉండబోదని భావించవచ్చు. ఇక కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని ఉద్యమాలు సాగుతున్నాయి కనుక అక్కడ హైకోర్టు ఏర్పాటు చేస్తే రాయలసీమవాసులు చాలా సంతోషిస్తారు. దానికి జ్యూడీషియల్ రాజధాని అని పేరు పెట్టుకొంటే నష్టం లేదు. 

ఏపీలో అన్ని విధాలా అభివృద్ధి చెంది, సకల సౌకర్యాలు కలిగిన విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామంటే ఉద్యోగులు అందరూ చాలా సంతోషిస్తారని వేరే చెప్పక్కరలేదు. కనుక మూడు రాజధానుల ప్రతిపాదనకు రాష్ట్ర ప్రజలు కూడా ఆమోదం తెలుపవచ్చు. 


Related Post