డికె.అరుణ అందుకే డిల్లీ వెళ్ళారా?

December 17, 2019


img

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండవసారి కూడా ఓడిపోవడం, గెలిచిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తెరాసలోకి వెళ్ళిపోతుండటంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఆ కారణంగానే సీనియర్ కాంగ్రెస్‌ నేత డికె.అరుణ కాంగ్రెస్‌ పార్టీకి గుడ్ బై చెప్పేసి బిజెపిలో చేరి మహబూబ్‌నగర్‌ నుంచి లోక్‌సభ టికెట్ కూడా సంపాదించుకొన్నారు కానీ గెలవలేకపోయారు. వరుసగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో ఓడిపోవడం ఆమెకు పెద్ద ఎదురుదెబ్బలుగానే చెప్పవచ్చు. కానీ మళ్ళీ తేరుకొని ఇప్పుడు బిజెపి రాష్ట్ర అధ్యక్షపదవి కోసం పార్టీలో సీనియర్ నేతలతో పోటీ పడుతున్నారు. బహుశః ఇదే పనిమీద ఆమె డిల్లీ వెళ్ళినట్లున్నారు. అయితే బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సహా బిజెపి ముఖ్యనేతలు ప్రస్తుతం జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల హడావుడిలో ఉన్నందున వారి కోసం డికె.అరుణ మరికొన్ని రోజులు డిల్లీలో ఎదురుచూడక తప్పదేమో?

అయితే రాష్ట్ర బిజెపి నేతలలో అనేకమంది సీనియర్ నేతలు అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నందున ఆరు నెలల క్రితం పార్టీలో చేరిన డికె.అరుణకు బిజెపి అధిష్టానం రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగిస్తుందా? అంటే అనుమానమే. కాంగ్రెస్‌తో పోలిస్తే బిజెపి సిద్దాంతాలు, పార్టీలో పరిస్థితులు, పనిచేసే విధానం పూర్తిగా భిన్నంగా ఉంటాయి. కనుక వాటికి అనుగుణంగా ఉండేవారికే పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Related Post