సరైన కోర్సు, కాలేజీ ఎంచుకోకపోతే...

December 17, 2019


img

మరో మూడు నెలల్లో 10వ తరగతి, ఇంటర్ పరీక్షలు జరుగుతాయి. సాధారణంగా 10వ తరగతి, ఇంటర్ పూర్తిచేసిన విద్యార్దులు తమ స్నేహితులు ఏదో కాలేజీలో ఏదో కోర్సులో చేరారని కనుక తాము కూడా అదే కాలేజీ, కోర్సులలో చేరిపోతుంటారు. లేదా తల్లితండ్రుల కలలు, అభిరుచులు, ఒత్తిడికి తలొగ్గి తమకు ఇష్టంలేని కోర్సులలో చేరి అయిష్టంగా చదువులు కొనసాగిస్తుంటారు. ఈ రెండూ పద్దతులు కూడా సరైనవి కావని అందరికీ తెలుసు. 

కనుక 10వ తరగతి, ఇంటర్ పూర్తి చేసిన విద్యార్దులు అటువంటి పొరపాట్లు చేయకుండా తమకు బాగా పట్టు, ఆసక్తి, అభిరుచి ఉన్న గ్రూపు, కోర్సులను ఎంచుకొని అందుకు తగిన కాలేజీలలోనే చేరడం చాలా మంచిది. అంతేకాదు... తల్లితండ్రులు ఆర్ధిక పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకొని తమ శక్తికి తగిన గ్రూపు, కోర్సులను ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యమే లేకుంటే ఆర్ధిక సమస్యల కారణంగా చదువులు మద్యలో నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. 

ఇంటర్‌, డిగ్రీ, ఐటిఐ, పాలిటెక్నిక్ స్థాయిలో అనేక రకాల కోర్సులు విద్యార్దులకు అందుబాటులో ఉన్నప్పటికీ వాటి గురించి విద్యార్దులకు సరైన అవగాహన లేకపోవడం వలన చదువులు పూర్తయిన తరువాత చాలామంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. 

ఉదాహరణకు ఇంటర్ తరువాత సులువుగా ఉద్యోగాలు పొందేందుకు ఇంటర్‌లోనే ‘ఒకేషనల్ కోర్సు’లున్నాయి కానీ వాటి గురించి సరైన ప్రచారం లేకపోవడంతో విద్యార్దులకు, వారి తల్లితండ్రులకు కూడా వాటి గురించి అవగాహన లేకుండా పోతోంది. దాంతో ఉన్న నాలుగు గ్రూపులలో ఏదో ఒకటి ఎంచుకొంటున్నారు.  

ఇప్పుడు న్యూస్ పేపర్లలో 10వ తరగతి, ఇంటర్ పూర్తిచేసిన తరువాత ఎటువంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి?అవి ఏఏ కాలేజీలలో అందుబాటులో ఉన్నాయి?వాటికి ఉద్యోగం, ఉపాధి అవకాశాలు ఏవిధంగా ఉన్నాయి?వంటి వివరాలను ప్రచురిస్తున్నాయి. అలాగే ఆన్‌లైన్‌లో కూడా వాటి గురించి సంపూర్ణ సమాచారం అందుబాటులో ఉంది. కనుక విద్యార్దులు పరీక్షలు పూర్తికాగానే తరువాత ఏమి చదవాలి? ఎక్కడ చదవాలి? అనే రెండు అంశాలపై దృష్టిపెట్టి ముందుగానే వాటికి సంబందించిన సమాచారమంతా సేకరించుకొన్నట్లయితే ప్రవేశాలు మొదలవగానే సరైన కోర్సు, కాలేజీలో చేరవచ్చు. ఇంటర్ స్థాయిలో విద్యార్దులు సరైన కోర్సు, గ్రూపు ఎంచుకొని ముందుకు సాగితే చదువులు పూర్తవగానే మంచి ఉద్యోగం లేదా ఉపాధి సంపాదించుకొని జీవితాంతం హాయిగా సుఖంగా జీవించవచ్చు.


Related Post