నాలుగు నెల్లల్లో రామమందిరం నిర్మిస్తాం: అమిత్ షా

December 16, 2019


img

బిజెపి జాతీయ అధ్యక్షుడు, కేంద్రహోంమంత్రి అమిత్ షా సోమవారం జార్ఖండ్‌లోని పాకూర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారసభలో ప్రజలనుద్దేశ్యించి మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ దేశానికి నష్టమే చేసింది తప్ప దేశం కోసం, దేశప్రజల కోసం చేసిందేమీ లేదు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఉన్న సమస్యలను పరిష్కరించకపోగా కొత్త సమస్యలను సృష్టించి పెట్టింది. జమ్ముకశ్మీర్‌, అయోధ్య వివాదం వంటివి దశాబ్ధాలుగా నలుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించలేకపోయింది. కాంగ్రెస్ పార్టీకి ఎల్లప్పుడూ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడమే తప్ప దేశ సమస్యలను పరిష్కరించడం చేతకాదు. పరిష్కరించాలనే ఆసక్తి కూడా లేదు. కానీ మా ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి దేశానికి సంబందించిన ఒక్కో సమస్యను శాశ్వితప్రాతిపదికన పరిష్కరించుకొంటూ ముందుకు సాగుతున్నాము. అటువంటిదే అయోధ్యలో రామాయలయ నిర్మాణం కోడా. శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో రామాలయం  నిర్మించాలని దేశప్రజలు కోరుకొంటున్నారు. రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు కూడా మార్గం సుగమం చేసింది కనుక ప్రజలకిచ్చిన మాట ప్రకారం 4 నెలలలోనే ఆకాశమంత ఎత్తు ఉండే రామాలయం నిర్మిస్తాము,” అని అన్నారు. 

ఒక శతాబ్ధానికిపైగా నలుగుతున్న అయోధ్య వివాదాన్ని మోడీ ప్రభుత్వం చాలా తెలివిగా, ఎటువంటి అల్లర్లు చెలరేగకుండా పరిష్కరించగలిగింది. ఈ క్రెడిట్ పూర్తిగా మోడీ ప్రభుత్వానిదేనని చెప్పక తప్పదు. అయితే రామాలయం పేరుతో రాజకీయాలు చేసే బలహీనత నుంచి బిజెపి బయటపడలేకపోతోందని చెప్పక తప్పదు. జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారసభలో అమిత్ షా ఈ ప్రకటన చేయడం ద్వారా ఇప్పుడూ దానితో రాజకీయ లబ్ది కోసం బిజెపి ప్రయత్నిస్తోందని అర్ధమవుతోంది.


Related Post