దిశ బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం...గుంటూరులో తొలి నేరం

December 13, 2019


img

దిశ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఏపీ ప్రభుత్వం అటువంటి నేరాలకు మూడు వారాలలోపు నేరస్తులకు ఉరిశిక్ష విధించేవిధంగా ఏపీ దిశ చట్టాన్ని నేడు శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేసింది. కొత్త చట్టప్రకారం అత్యాచారం చేసినట్లు రుజువైతే 3 వారాలలోపు కోర్టు విచారణ కూడా పూర్తి చేసి దోషికి ఉరిశిక్ష విధిస్తారు. 

శాసనసభ ఆమోదించిన ఈ ఏపీ దిశ చట్టానికి గవర్నర్‌ సంతకం చేసి ఆమోదముద్ర వేయక మునుపే రాజధాని అమరావతిని ఆనుకొని ఉన్న గుంటూరులో తొలి అత్యాచారం కేసు నమోదు అయ్యింది. నగరంలో ఇంటర్ చదువుతున్న లక్ష్మణ్ రెడ్డి అనే విద్యార్ధి రామిరెడ్డినగర్‌లో నివశిస్తున్న ఓ బాలికపై అత్యాచారం చేశాడు. బాలిక తల్లితండ్రులు ఫిర్యాదు మేరకు నగరపాలెం స్టేషన్ పోలీసులు వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేశారు. బాలికను ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహింపజేసిన తరువాత ఆమెపై అత్యాచారం జరిగినట్లు దృవీకరించారు.

లక్ష్మణ్ రెడ్డి ఇంటర్ చదువుతున్నాడంటే అతని వయసు సుమారు 15-16 సం.లు ఉంటుంది. అతను మైనర్‌ బాలుడు. కనుక ఈ కొత్త చట్టం ప్రకారం అతనికి ఉరిశిక్ష విధించడానికి లేదు. చట్ట ప్రకారం మైనర్లను జువైనల్ హోంకు తరలించి అక్కడ క్రమశిక్షణ, మంచి అలవాట్లు నేర్పించి మళ్ళీ మంచి పౌరుడిగా జీవించేందుకు అవకాశం కల్పించబడుతుంది. ఏపీలో దిశ కొత్త చట్టం వచ్చింది కానీ దానికి ఇంకా గవర్నర్‌ ఆమోదముద్రపడలేదు కనుక ఈ కేసును పోలీసులు, న్యాయస్థానం  ఏవిధంగా పరిగణిస్తాయో చూడాలి.


Related Post