తెరాస-బిజెపిల మద్య మళ్ళీ యుద్ధం షురూ?

December 13, 2019


img

తెలంగాణతో సహా దక్షిణాది రాష్ట్రాల పట్ల మోడీ సర్కార్ వివక్ష చూపుతోందని, అభివృద్ధి పధకాలన్నీ ఉత్తరాది రాష్ట్రాలకే కేటాయిస్తోందంటూ మంత్రి కేటీఆర్‌ చేసిన విమర్శలతో రాష్ట్రంలో మళ్ళీ తెరాస-బిజెపిల మద్య యుద్ధం మొదలైంది. జీఎస్టీలో రాష్ట్రానికి రావలసిన వాటాను, ఇతర బకాయిలను కేంద్రప్రభుత్వం సకాలంలో విడుదల చేయడంలేదని తెరాస ఆరోపిస్తూ పార్లమెంటు ఆవరణలో తెరాస ఎంపీలు ధర్నాతో బిజెపి(కేంద్రప్రభుత్వం)తో తెరాస యుద్దానికి సిద్దం అయ్యింది.  

పౌరసత్వ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ తెరాస ఓటు వేయడంతో రాష్ట్ర బిజెపి నేతలు కూడా తెరాస సర్కార్‌పై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. 

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడుతూ, “తెరాస నేతలు ఇక్కడ హైదరాబాద్‌లో ప్రగల్భాలు పలుకుతుంటారు. డిల్లీలో కాళ్ళు పట్టుకొంటుంటారు. రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితిని అస్తవ్యస్తం చేసిన ఘనత సిఎం కేసీఆర్‌దే. ఆర్ధికమంత్రి ప్రమేయం లేకుండానే ఆర్ధిక అంశాలకు సంబందించి కీలక నిర్ణయాలు తీసుకొంటుంటారు. ప్రాజెక్టులు పేరు చెప్పి లక్షల కోట్లు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేసి, ఇప్పుడు కేంద్రం నిధులు ఇవ్వడం లేదు... ఆర్ధికమాంద్యం అంటూ తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్రం ఎరువుల కోసం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించిన మాట నిజం కాదా? హరితహారం పేరిట తెరాస నేతలు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారు. హైకోర్టు చెప్పినా ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ జీతాలు చెల్లించడానికి రూ.47 కోట్లు లేవని చెప్పిన కేసీఆరే ఆ తరువాత 55 రోజుల సమ్మె కాలానికి జీతం ఇస్తామని ప్రకటించడం చూస్తే కేసీఆర్‌ మాటలకు ఎక్కడా పొంతన ఉండదని స్పష్టం అవుతోంది. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలను మూసివేయడానికి  ప్రభుత్వం సిద్దం అవుతోంది. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయి. కానీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. ఇంతవరకు సిఎం కేసీఆర్‌ దిశ తల్లితండ్రులను పరామర్శించనే లేదు,” అని విమర్శించారు. 

జీఎస్టీలో రాష్ట్రానికి రావలసిన వాటాను, ఇతర బకాయిలను కేంద్రప్రభుత్వం ఎందుకు విడుదల చేయడంలేదు? అనే తెరాస ప్రశ్నకు రాష్ట్ర బిజెపి నేతలు సూటిగా జవాబు చెప్పరు. తిరిగి ఈవిధంగా విమర్శలు గుప్పిస్తుంటారు.

ప్రాజెక్టుల పేరిట అప్పులు చేసి, కేంద్రం ఇస్తున్న నిధులను పక్కదారి పట్టిస్తూ, ఆర్ధిక క్రమశిక్షణ పాటించకుండా విచ్చలవిడిగా ప్రజాధనం ఖర్చు చేస్తూ కేంద్రాన్ని ఎందుకు నిందిస్తున్నారనే బిజెపి ప్రశ్నలకు తెరాస జవాబు చెప్పదు. ఈ సమస్య ఎన్నటికీ పరిష్కారం కాదు కనుక రెండు పార్టీల మద్య ఈ వాదోపవాదాలు, విమర్శలు ప్రతివిమర్శలు కొనసాగుతూనే ఉంటాయి. అవి కాలక్షేపానికే తప్ప రాష్ట్రానికి, ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడవని అందరికీ తెలుసు.


Related Post