రాష్ట్ర ఆర్ధిక సమస్యలకు కారణం ఏమిటి?

December 13, 2019


img

తెరాస పాలనలో మొదటి 5 ఏళ్ళు పూల నావలా సాగిపోయింది. రాష్ట్రంలో అనేకానేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యాయి. కనుక తెరాస పాలన ‘నభూతో నభవిష్యత్’ అన్నట్లు సాగుతోందని తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు పొగుడుకొన్నారు. దానిని ఎవరూ తప్పు పట్టలేదు. ఎందుకంటే తెరాస అధికారంలోకి వచ్చిన తరువాతే రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాలలో సమాంతరంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. వాటి గురించి గణాంకాలు కూడా అవసరం లేదు. ఎందుకంటే వాటిలో చాలా వరకు ప్రత్యక్షంగా అందరి కళ్ళకు కనబడుతున్నాయి. కనుక రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపినందుకు ప్రజలు మళ్ళీ కేసీఆర్‌కే పట్టం కట్టారు. కనుక రెండవ సారి అధికారంలోకి వచ్చిన తరువాత తెరాస పాలన మరింత సాఫీగా పూలనావలా సాగిపోవాలి. కానీ ఇప్పుడు పరిస్థితులు కొంచెం తారుమారు అయినట్లు కనిపిస్తున్నాయి. 

నిరుద్యోగభృతి, పంటరుణాల మాఫీ తదితర హామీలను తెరాస సర్కార్‌ ఇంతవరకు అమలు చేయలేకపోయింది. దేశంలోకెల్లా అత్యంత సమర్ధవంతమైన, అత్యాధునికమైన పోలీస్ వ్యవస్థ ఉన్నప్పటికీ రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, కిడ్నాపులు జరుగుతూనే ఉన్నాయి. 

ఏ రాష్ట్రంలోనైనా నేరాలను పూర్తిగా అదుపు చేయడం కష్టమే కనుక తెలంగాణలో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, కిడ్నాపులకు పోలీసులను నిందించలేము. కానీ దిశ, హాజీపూర్ వంటి ఘటనలలో స్థానిక పోలీసుల అలసత్వం వలననే యావత్ పోలీస్ శాఖకు చెడ్డపేరు వచ్చిందని అందరికీ తెలుసు. కనుక ఇటువంటి చిన్న చిన్న లోపాలను పోలీస్ శాఖ సరిచేసుకొని, పోలీసులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నట్లయితే ఇటువంటి నేరాలను తప్పకుండా అదుపుచేయడం వారికి పెద్ద కష్టమేమీకాదని చెప్పవచ్చు.

 ఇక హామీల అమలులో వైఫల్యం, అభివృద్ధి సంక్షేమ పధకాలకు బ్రేకులుపడటానికి ఆర్ధిక మాంద్యమే ప్రదాన కారణమని, కేంద్రప్రభుత్వం జీఎస్టీలో రాష్ట్ర వాటాను విడుదల చేయకపోవడం మరో కారణమని తెరాస సర్కార్‌ వాదిస్తోంది. ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ లోపించడం కూడా మరో కారణం అని చెప్పవచ్చు. ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఇంత త్వరగా ఆర్ధిక సమస్యలలో కూరుకుపోవడం చాలా బాధాకరమే. 

కేంద్రప్రభుత్వం నేడో రేపో తప్పకుండా జీఎస్టీలో రాష్ట్ర వాటాను విడుదల చేస్తుంది కనుక కొంత ఉపశమనం లభిస్తుంది. అయితే ప్రస్తుతం ఎదురవుతున్న ఈ ఆర్ధిక సమస్యలనే తెరాస సర్కార్‌ పాఠాలుగా స్వీకరించి ఇక నుంచైనా ఆర్ధిక క్రమశిక్షణ పాటిస్తే భవిష్యత్‌లో ఇటువంటి సమస్యలు పునరావృతం కావు.


Related Post