శంషాబాద్‌ విమానాశ్రయంలో 14 కేజీల బంగారం స్వాధీనం

December 13, 2019


img

గురువారం తెల్లవారుజామున దుబాయి నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకొన్న విమానంలో 14 కేజీల బంగారు కడ్డీలు పట్టుబడ్డాయి. దుబాయి నుంచి ఇద్దరు వ్యక్తులు వాటిని రహస్యంగా హైదరాబాద్‌ తీసుకువస్తున్నట్లు సమాచారం అందడంతో  డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజన్స్ అధికారులు శంషాబాద్‌ విమానాశ్రయంలో కాపుకాసి వారిని, బంగారాన్ని పట్టుకొన్నారు. వారిలో ఒకరు దక్షిణ కొరియా దేశస్థుడు కాగా మరొకరు చైనా దేశస్థుడు. వారిరువురూ బంగారు కడ్డీలను నల్లటేపులో చుట్టి విమానంలో తాము కూర్చోన్న 31ఏ, 32ఏ సీట్ల క్రింద పెట్టి హైదరాబాద్‌ చేర్చగలిగారు కానీ అధికారులు అప్రమత్తం అవడంతో పట్టుబడ్డారు. స్వాధీనం చేసుకొన్న బంగారం విలువ సుమారు రూ. 5.46 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. 

అసలు అంతా బంగారాన్ని అందరి కళ్ళూగప్పి బయటకు తీసుకుపోవచ్చునని వారు భావించారంటే శంషాబాద్‌ విమానాశ్రయంలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ఎవరైనా వారికి సాయపడుతున్నారా? అనే అనుమానం కలుగకమానదు. ఇక ప్రతీసారి బారీగా బంగారం పట్టుబడినట్లు వార్తలు వస్తుంటాయే తప్ప దానిని నగరంలో ఎవరు రప్పించుకొంటున్నారు? పట్టుబడిన బంగారాన్ని అధికారులు ఎక్కడ జమా చేస్తున్నారు? ఆ తరువాత ఏమి జరిగింది? అక్రమంగా ఇంత విలువైన బంగారాన్ని రప్పించుకొన్నవారు కేసులకు భయపడి దానిని వదులుకోలేరు కనుక వారు అధికారులకు లంచాలు ముట్టజెప్పి మళ్ళీ తీసుకుపోతున్నారా? లేక అధికారులు ఆ బంగారాన్ని ప్రభుత్వ ఖజానాలో జమా చేస్తున్నారా? అనే విషయాలు ఏనాడూ బయటకు పొక్కలేదు. కానీ విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా ఆగలేదంటే అర్ధం పట్టుబడిన బంగారం తరువాత మెల్లగా దాని యజమానులకు చేరుతోందనే అనుమానం కలుగుతోంది లేకుంటే ప్రతీసారి అంత బంగారాన్ని ఎవరూ వదులుకోరు కదా? 


Related Post