నిర్భయ దోషుల ఉరిశిక్షకు సర్వం సిద్దం

December 13, 2019


img

సరిగ్గా ఏడు సంవత్సరాల క్రితం డిసెంబర్ 16 రాత్రి డిల్లీలో నిర్భయ అత్యాచారం జరిగింది. ఆమెను అత్యంత క్రూరంగా హింసించి, అత్యాచారం చేసి ఆమె మరణానికి కారకులైన నలుగురు నిందితులకు సుప్రీంకోర్టు ఉరిశిక్షలు విధించింది. కానీ వారు మన చట్టాలలోని లొసుగులను, ఉన్న అన్ని అవకాశాలను తెలివిగా ఉపయోగించుకొంటూ ఇంతకాలం శిక్ష పడకుండా తప్పించుకొన్నారు. కానీ ఇక వారికి రోజులు దగ్గరపడ్డాయి. సుప్రీంకోర్టు ఆదేశాలు అందగానే వారికి ఉరిశిక్ష అమలుచేయడానికి తీహార్ జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 

ఇప్పటికే ఉరితాళ్ళు తెప్పించి సిద్దంగా ఉంచారు. తీహార్ జైల్లో 3వ నెంబరు గదిలో వారిని ఉరి తీసేందుకు అన్ని సిద్దం చేసి ఉంచారు. నిబందనల ప్రకారం దోషులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే ఉరిశిక్షను అమలుచేయవలసి ఉంటుంది. కనుక తీహార్ జైలు వైద్యులు వారిని రోజూ పరీక్షించి ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా భద్రంగా కాపాడుతున్నారు! 

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వారిని క్షమించనవసరం లేదని ఇదివరకే తేల్చి చెప్పేశారు కనుక క్షమాభిక్ష పిటిషన్లకు దారులు మూసుకుపోయినట్లే. నలుగురు దోషులలో ఒకడైన అక్షయ్ ఠాకూర్ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేశారు. దానిలో పురాణాలు, ఇతిహాసాలు, మానవత్వం, వాయుకాలుష్యంతో ప్రజలు చనిపోతుండటం వంటి అనేక అంశాలు ప్రస్తావించి తనకు ఉరిశిక్ష విధించడం సరికాదని సుప్రీంకోర్టుకు విన్నవించుకోవడం విశేషం. నిర్భయపై అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారం చేసి ఆమె పేగులు బయటకు లాగి పైశాచికానందం పొందినప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా? అని నిర్భయ తల్లి ప్రశ్నించారు. 

ఈ వాదోపవాదాలు ఎలా ఉన్నప్పటికీ రాష్ట్రపతి, కేంద్రప్రభుత్వం, దేశప్రజలు, న్యాయస్థానాలు అన్ని నలుగురు దోషులకు ఉరిశిక్షపడాలనే నిశ్చయించుకొన్నందున నిర్భయను అత్యాచారం చేసిన రోజునే వారికి తీహార్ జైల్లో ఉరిశిక్ష అమలుచేసే అవకాశం ఉంది. అంటే వారికి ఇంకా మూడు రోజులు మాత్రమే ఆయుషు మిగిలి ఉందన్నమాట.


Related Post