బిజెపి పాలిత రాష్ట్రాలలో నిషేధం విదించలేదేమి?

December 12, 2019


img

దిశ ఘటనలో నలుగురు నిందితులు మద్యం మత్తులో విచిక్షణ మరిచి హత్యాచారానికి పాల్పడటంతో రాష్ట్రంలో మద్యపానంపై నిషేదం విధించాలని మహిళలు కోరుతున్నారు. బిజెపి మహిళా నేత డికె.అరుణ వారిలో ఒకరు. రాష్ట్రంలో మద్యపానంపై నిషేదం విధించాలని కోరుతూ ఆమె గురువారం ఇందిరాపార్క్ వద్ద సంకల్ప దీక్ష చేశారు. 

ఈ సందర్భంగా రాష్ట్ర బిజెపి  అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఆమెకు సంఘీభావం తెలిపేందుకు వచ్చినప్పుడు మీడియాతో మాట్లాడుతూ, “దిశ ఘటనకు ప్రధాన కారణం మద్యపానమే. దిశ ఘటనతో హైదరాబాద్‌ ప్రతిష్టకు భంగం కలిగింది. హైదరాబాద్‌లో పబ్ కల్చర్ పెరిగిపోవడంతో యువత యధేచ్చగా మద్యపానానికి అలవాటుపడుతోంది. ఆ కారణంగా వారి జీవితాలు నాశనం అవుతున్నాయి. నేరాలు కూడా పెరుగుతున్నాయి. అయినప్పటికీ మద్యం అమ్మకాలపై వచ్చే ఆదాయం కోసం తెరాస సర్కార్‌ మద్యపానాన్ని ప్రోత్సహిస్తోంది. మద్యపానాన్ని, అమ్మకాలను నియంత్రించవలసిన ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాలను పెంచేశాఖగా మారిపోవడంతో హైదరాబాద్‌తో సహా చుట్టుపక్కల ఊర్లలో కూడా మద్యం ఏరులై పారుతోంది. దాంతో సామాన్యప్రజల ఆరోగ్యం పాడవుతోంది. దిశ వంటి హేయమైన నేరాలు కూడా జరుగుతున్నాయి. కనుక ఇకనైనా తెరాస సర్కార్‌ మద్యపానంపై నిషేదం విధించాలని డిమాండ్ చేస్తున్నాము,” అని అన్నారు.

మద్యపానం వలన అనర్ధాలు అందరికీ తెలుసు. అయినప్పటికీ మద్యం అమ్మకాలపై వచ్చే భారీ ఆదాయాలను వదులుకోవడానికి చాలా రాష్ట్రాలు సిద్దంగా లేవు. వాటిలో తెలంగాణ కూడా ఒకటని చెప్పకతప్పదు. మద్యపానం నిషేదించాలనే బిజెపి డిమాండ్ సహేతుకమైనదే కానీ రాష్ట్రంలో మద్యం నిషేదించాలని అడిగేముందు బిజెపి పాలిత రాష్ట్రాలలో మద్యం నిషేదించిదా? అనే ప్రశ్నకు బిజెపి జవాబు చెప్పవలసి ఉంటుంది. 


Related Post