గజ్వేల్ సరే మిగిలిన రాష్ట్రం సంగతో?

December 12, 2019


img

సిఎం కేసీఆర్‌ బుదవారం గజ్వేల్‌లో కొత్తగా నిర్మించిన సమీకృత మార్కెట్, ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా కేంద్రం, ఉద్యానవన విశ్వవిద్యాలయం, మహతీ ఆడిటోరియం భవనాలకు ప్రారంభోత్సవాలు చేశారు. తరువాత రూ.100 కోట్లు వ్యయంతో నిర్మించబోతున్న గజ్వేల్-ప్రజ్ఞాపూర్‌ మద్య అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు, గజ్వేల్ పట్టణంలో రూ.32 కోట్లతో నిర్మించబోతున్న వంద పడకల మాతా-శిశు ఆసుపత్రికి సిఎం కేసీఆర్‌ శంఖుస్థాపనలు చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మహతి ఆడిటోరియంలో మీడియాతో మాట్లాడుతూ, “గజ్వేల్ నుంచే ప్రజల హెల్త్ రికార్డ్ సేకరణ కార్యక్రమం ప్రారంభించబోతున్నాము. గజ్వేల్‌లో ప్రతీ ఒక్కరి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని అవసరమైనవారికి వైద్యం అందిస్తాము. గజ్వేల్‌లో ప్రతీఒక్కరికీ తప్పనిసరిగా సొంత ఇల్లు ఉండేలా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు నిర్మించి ఇస్తాము. ఎక్స్‌రే ఆఫ్ గజ్వేల్ పేరిట గజ్వేల్ పట్టణంలో ప్రతీ ఇంటిలో యువత విద్యార్హతలు, వృత్తి నైపుణ్యంకు సంబందించి పూర్తి వివరాలు సేకరించి వారికి ఉద్యోగం లేదా ఉపాధి కల్పిస్తాము. రాజకీయాలకు అతీతంగా గజ్వేల్‌లో ప్రతీ ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా చేస్తాము. రాష్ట్రంలో ఇతర జిల్లాలు, నియోజకవర్గాలకు వెళ్ళి ఏదో చేసి చూపిస్తామని చెప్పడం కంటే గజ్వేల్‌లో చేసి చూపించి మాట్లాడితే బాగుంటుందని భావిస్తున్నాను,” అని అన్నారు. 


గజ్వేల్‌ సిఎం కేసీఆర్‌ సొంత నియోజకవర్గం కనుక రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతుండటం చాలా అభినందనీయమే. కానీ రాష్ట్రంలో వెనుకబడిన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నాగర్‌కర్నూల్, భూపాలపల్లి, కొత్తగూడెం వంటి జిల్లాలను పట్టించుకొనేనాధుడే లేడు. ఆ జిల్లాలో అనేక నియోజకవర్గాలలో పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, రోడ్లు, మంచినీరు వంటి ప్రాధమిక సౌకర్యాలు కూడా లేవు. ఒకవేళ ఉన్నా అవి అంత ఉపయోగకరంగా లేవు. 


తెరాస సర్కార్‌లో కొందరు ముఖ్య నేతలు, కొందరు ప్రముఖ మంత్రుల నియోజకవర్గాలలో మాత్రమే గజ్వేల్‌తో పోటీపడే స్థాయిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మిగిలిన నియోజకవర్గాలలో అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రభుత్వం నుంచి నిధులు సాధించుకోలేకపోవడం చేతనో లేదా ప్రభుత్వమే ఆ జిల్లాలపై వివక్ష చూపుతున్నందునో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నోచుకోవడం లేదు. కనుక గజ్వేల్‌, సిద్ధిపేట, సిరిసిల్లాలు మాత్రమే కాకుండా రాష్ట్రంలో అన్ని జిల్లాలు సమాంతరంగా అభివృద్ధి చేయవలసి ఉంది.


Related Post