దిశ ఎన్‌కౌంటర్‌ తదుపరి పరిణామాలు

December 12, 2019


img

దిశ ఘటన ఏవిధంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందో, అదేవిధంగా దిశ ఎన్‌కౌంటర్‌ కూడా సంచలనం సృష్టించింది. అత్యాచారకేసులలో దోషులకు శిక్షలు పడటంలో తీవ్ర జాప్యం జరుగుతున్న కారణంగా మెజార్టీ ప్రజలు దిశ ఎన్‌కౌంటర్‌ను సత్వర న్యాయంగా భావిస్తూ బలంగా సమర్ధించారు. అయితే న్యాయస్థానాలు, పౌరహక్కుల సంఘాలు, బడుగు బలహీనవర్గాలకు చెందిన ఎంఆర్పీఎస్ వంటి కొన్ని ప్రజాసంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే ఈ దిశ ఎన్‌కౌంటర్‌ను సవాలు చేస్తూ హైకోర్టు, సుప్రీంకోర్టు, జాతీయ మానవహక్కుల కమీషన్ వేర్వేరుగా కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నాయి. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ  రిటైర్డ్ ప్రొఫెసర్ రామశంకర నారాయాన్ మేల్కొటే, రిటైర్డ్ లెక్చరర్ జీవన్ కుమార్ కలిసి హైకోర్టులో ప్రజాహిత పిటిషన్‌ వేశారు. దిశ ఘటనతో ప్రజలలో తలెత్తిన భావోద్వేగాలను దృష్టిలో పెట్టుకొని సత్వర న్యాయం పేరిట నిందితులను భూటకపు ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులపై హత్యానేరం క్రింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. ఈ ఎన్‌కౌంటర్‌పై ఇతర రాష్ట్రానికి చెందిన పోలీసుల చేత మళ్ళీ దర్యాప్తు జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలని పిటిషనర్లు కోరారు.   

రాష్ట్ర పౌరహక్కుల సంఘం కూడా దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సంఘం అధ్యక్షుడు ప్రొ.లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు హైకోర్టు న్యాయవాది రఘునాధ్, కార్యదర్శి నారాయణరావు తదితరులు బుదవారం గుడిగండ్ల, జక్లెరు గ్రామాలకు వెళ్ళి దిశ నిందితుల కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడారు.

నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడానికే రాత్రిపూట అక్కడకు తీసుకువెళ్ళారని, ఒకవేళ నిందితులు పోలీసులకు ఎదురుతిరగదలిస్తే గ్రామంలో తమ మద్య ఉన్నప్పుడే ఎదురుతిరిగి ఉండేవారని వారి కుటుంబ సభ్యులు చెప్పారని పౌరహక్కుల సంఘం ప్రతినిధులు తెలిపారు. దిశ తల్లి తండ్రులు కూడా దోషులకు చట్టప్రకారమే ఉరిశిక్షలుపడాలని కోరుకొన్నారు తప్ప ఈవిధంగా ఎన్‌కౌంటర్‌ చేయాలని కోరుకోలేదని వారు అన్నారు. క్రైమ్ సీన్ రిక్రియేషన్ పేరిట భూటకపు ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులపై జాతీయమానవ హక్కుల కమీషన్ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.


Related Post