ఏపీలో రేప్ చేస్తే 3వారాల్లోనే ఉరిశిక్ష

December 11, 2019


img

దిశ ఘటనను చాలా తీవ్రంగా పరిగణించిన ఏపీలోని జగన్ ప్రభుత్వం రేపిస్టులను 21 రోజులలోగా ఉరి తీసేవిధంగా ఏపీ దిశ చట్టాన్ని రూపొందించి దానికి ఇవాళ్ళ మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. దాని ప్రకారం అత్యాచారకేసులపై పోలీసులు వారం రోజుల్లోగా కోర్టుకు సమర్పించేందుకు అవసరమైన అన్ని సాక్ష్యాధారాలు సేకరించి, దర్యాప్తు పూర్తిచేయాల్సి ఉంటుంది. అప్పటి నుంచి రెండు వారాలలోపుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు విచారణ పూర్తి చేసి నేరం రుజువైతే దోషులకు ఉరిశిక్ష విధిస్తాయి. తీర్పు వెలువడిన మూడురోజులలోగా ఉరిశిక్షను అమలుచేయాల్సి ఉంటుంది.  

ఈ కొత్త చట్టంలో ‘సెక్షన్ 354-ఈ’ ప్రకారం అత్యాచారం చేసినట్లు రుజువైతే వెంటనే ఉరిశిక్ష విధిస్తారు.  చిన్నారులను లైంగికంగా వేధించినట్లయితే 14 ఏళ్ళు జైలు శిక్ష, ఈ కేసుల తీవ్రతను బట్టి అవసరమైతే జీవితఖైదు విధిస్తారు. మహిళలను ఉద్దేశ్యించి అనుచితంగా సోషల్ మీడియాలో ఫోటోలు, మెసేజులు పెట్టినవారికి మొదటిసారి 2 ఏళ్ళు, మళ్ళీ అదే తప్పు మరోసారి చేస్తే 4 ఏళ్ళు జైలు శిక్ష విధించబడుతుంది. పోక్సో చట్టం క్రింద ప్రస్తుతం ఉన్న కనీస శిక్షను 5 ఏళ్ళకు పెంచుతూ చట్ట సవరణ చేశారు. 

ఏపీ క్రిమినల్‌ లా చట్టం 2019కు సవరణ ద్వారా రూపొందించిన ఏపీ దిశ చట్టానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది శాసనసభ, మండలిలో వైసీపీకి పూర్తి మెజార్టీ ఉంది కనుక అక్కడా వాటికి ఆమోదం లభించడం లాంఛనప్రాయమేనని చెప్పవచ్చు.

ఏదైనా ఒక కొత్త వస్తువు కొనుకొన్నప్పుడు దానిని వెంటనే ఉపయోగించుకోవాలనే అందరూ ఆతృత పడుతుంటారు. అలాగే ఈ కొత్త చట్టాన్ని కూడా వీలైనంత త్వరగా అమలుచేసి ప్రజలలో గొప్పపేరు సంపాదించుకోవాలని ఏపీ ప్రభుత్వం కూడా ఆశించడం సహజమే. కనుక ఏపీలో మహిళలను, చిన్నారులపై అత్యాచారాలు, లైంగిక దాడులు చేయాలనుకొనేవారు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవలసిందే. దొరికితే ఉరికొయ్యకు వ్రేలాడక తప్పదు.


Related Post