విజయానికి మారుపేరు ఇస్రో

December 11, 2019


img

ఇస్రో ఖాతాలో ఈరోజు మరో విజయం నమోదు అయ్యింది. ఈరోజు మధ్యాహ్నం నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి పిఎస్ఎల్వీ-సి48 ద్వారా ఇస్రో ఒకేసారి 10 ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించింది. ఈ ప్రయోగం విజయవంతం అవడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంతోషంతో చాలా ఉప్పొంగిపోయారు. 

ఇవాళ్ళ భారత్‌కు చెందిన రీశాట్-2బిఆర్ 1 అనే ఉపగ్రహంతో పాటు అమెరికా-6, జపాన్-1, ఇటలీ-1, ఇజ్రాయెల్-1 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. విదేశీ ఉపగ్రహాలను పంపించేందుకు ఆయా దేశాలు ఇస్రోకు ఛార్జీలు చెల్లిస్తుంటాయి కనుక వాటితో పాటు మన ఉపగ్రహాన్ని ఉచితంగా పైకి పంపించుకొన్నట్లు చెప్పవచ్చు.  

ఈ ప్రయోగంతో ఇస్రో ఇప్పటివరకు శ్రీహరికోట నుంచి మొత్తం 75 ప్రయోగాలు పూర్తి చేసుకొంది. అలాగే ఇస్రోకు నమ్మిన బంటు వంటి పీఎస్ఎల్వీతో ఇప్పటికీ 50సార్లు ప్రయోగాలు నిర్వహించగా కేవలం రెండుసార్లు మాత్రమే  విఫలమయ్యింది. గత ఏడాది పీఎస్ఎల్వీ-సీ37తో ఇస్రో ఒకేసారి 104 చిన్న చిన్న ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టి సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రపంచంలో మరే దేశమూ ఒకేసారి ఇన్ని ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టలేదు. 

ప్రపంచంలోకెల్లా అత్యంత చవకగా చైనా వస్తువులు లభిస్తుంటాయి. అలాగే ప్రపంచంలోకెల్లా అత్యంత చవకగా, అత్యంత విజయవంతంగా ఇస్రో ఇతరదేశాల ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెడుతోంది. తద్వారా తన ప్రయోగాలకు అవసరమైన వందల కోట్లు పెట్టుబడిని ఇస్రో స్వయంగా సంపాదించుకొంటుంది. ఒకప్పుడు కేంద్రప్రభుత్వం ఇస్రో ప్రయోగాలకు వందల కోట్లు పెట్టుబడి పెట్టేది. కానీ ఇప్పుడు ఇస్రోయే దేశానికి ఎంతో విలువైన విదేశీమారక ద్రవ్యాన్ని బారీగా సంపాదించిపెడుతోంది. ఈ ప్రయోగాలతో భారత్‌ పేరు ప్రతిష్టలు ప్రపంచమంతా మారుమ్రోగిపోయేలా చేస్తోంది ఇస్రో. అంతేగాక...అంతరిక్షంలో భారత్‌కు కళ్ళు, చెవులు వంటి అనేకానేక ఉపగ్రహాలను ఏర్పాటు చేస్తోంది. 

స్వాతంత్రం వచ్చిన కొత్తలో భారత్‌ ఉపగ్రహ ప్రయోగాల గురించి ఆలోచిస్తున్నట్లు తెలిసి అమెరికాతో అగ్రదేశాలన్నీ  విరగబడి నవ్వాయి. ‘తినడానికి తిండి లేదు మీసాలకు సంపెంగ నూనె రాసుకొంటోందని’ ఎగతాళి చేశాయి. ఇప్పుడు అవే దేశాలు ఇస్రోను ఆశ్రయిస్తున్నాయి. తమ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించేందుకు బారీగా డబ్బు కూడా చెల్లిస్తున్నాయి. దటీజ్ ఇస్రో...దటీజ్ ద బ్రెయిన్ పవర్ ఆఫ్ ఇండియన్స్!


Related Post