జీఎస్టీ నిధుల కోసం తెరాస ఎంపీలు డిల్లీలో ధర్నా!

December 11, 2019


img

రాష్ట్రాల నుంచి వసూలు అయ్యే  జీఎస్టీ పన్నులు కేంద్రప్రభుత్వం ఖాతాలో జమా అయిన తరువాత నిర్ధిష్ట కాలపరిమితిలోగా రాష్ట్రాల వాటాలను తిరిగి చెల్లించవలసి ఉంటుంది. లేకుంటే రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితులు తలక్రిందులవుతాయి. రాష్ట్రాలలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కూడా నిలిచిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఇప్పుడు చాలా రాష్ట్రాలలో ఇవే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. 

కేంద్రప్రభుత్వం జీఎస్టీలో రాష్ట్రాల వాటాలను సకాలంలో చెల్లించకపోవడంపై ప్రతీ జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలలో రాష్ట్రాల ఆర్ధికమంత్రులు, ప్రతినిధులు ఎంతగా మొట్టుకొంటున్నా కేంద్రప్రభుత్వం హామీలతో సరిపెడుతోందే తప్ప నిధులు విడుదల చేయడం లేదు. 

తెలంగాణ కూడా ఈ సమస్యకు అతీతం కాదు. గత సంవత్సరం కంటే జీఎస్టీ ఆదాయం గణనీయంగా పెరిగినందున గత ఏడాది కంటే 6.2 శాతం ఎక్కువగా లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తే, గత ఏడాది కంటే 2.13 శాతం తక్కువ ఇచ్చింది. దీంతో తెలంగాణ ఆర్ధికపరిస్థితి ఇబ్బందికరంగా మారింది.  

అందుకే తెరాస ఎంపీలు పార్లమెంటు ఉభయసభలలో దీనిపై చర్చ కోరుతూ నేడు వాయిదా తీర్మానం ఇచ్చారు. ఆ తరువాత పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద నిలబడి జీఎస్టీలో తెలంగాణ రాష్ట్ర వాటాను తక్షణం విడుదల చెయాలంటూ ధర్నా చేస్తున్నారు. వాటితో పాటు రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు రావలసిన నిధులు, ఆర్ధిక సంఘం చెల్లించవలసిన బకాయిలను తక్షణం చెల్లించాలని కోరుతూ ధర్నా చేస్తున్నారు. 

బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు రాష్ట్రానికి లక్షల కోట్లు నిధులు అందిస్తున్నామని చెపుతుంటారు. రాష్ట్ర బిజెపి నేతలు కూడా అదే చెపుతుంటారు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని తెరాస ఎంపీల ధర్నా చూస్తే అర్ధం అవుతోంది. కాంగ్రెస్‌, బిజెపి ఎంపీలు కూడా వారితో చేరకపోయినా పరువలేదు కానీ రాష్ట్రానికి రావలసిన నిధులు, బకాయిల గురించి పార్లమెంటులో గట్టిగా మాట్లాడగలిగితే చాలు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్‌, బిజెపి ఎంపీలు అందరూ పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై చర్చలలో బిజీగా ఉన్నారు. మరి తెలంగాణ సమస్యల గురించి, నిధుల గురించి ఎప్పుడు మాట్లాడుతారో? 


Related Post