హైదరాబాద్‌ తరువాత స్థానం కరీంనగర్‌దేనా?

December 11, 2019


img

దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో హైదరాబాద్‌ అగ్రస్థానంలో నిలుస్తోంది. మౌలికవసతులు, జీవన ప్రమాణాలు, పారిశ్రామీకరణ, రవాణాసౌకర్యాలు వంటివాటిలో హైదరాబాద్‌ దేశంలో మిగిలిన మెట్రోలతో పోటీ పడుతూ దూసుకుపోతోంది. 

తెలంగాణలో హైదరాబాద్‌ తరువాత వరంగల్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఇప్పటి వరకు రెండవ స్థానంలో నిలుస్తోంది. కానీ ఆ స్థానాన్ని త్వరలోనే కరీంనగర్‌ సొంతం చేసుకోబోతోంది. మోడీ ప్రభుత్వం మొదటిసారి అధికారం చేపట్టిన తరువాత దేశంలో 100 పట్టణాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. వాటిలో కరీంనగర్‌ కూడా ఎంపికైంది. అప్పటి నుంచే కరీంనగర్‌ శరవేగంగా అభివృద్ధి చెందడం మొదలైందని చెప్పవచ్చు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా గట్టి ప్రయత్నాలు చేయడంతో కరీంనగర్‌ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా భారీగా నిధులు విడుదల చేస్తోంది. దాంతో కరీంనగర్‌లో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. 

కరీంనగర్‌ పట్టణం అభివృద్ధికి 2014లో సిఎం కేసీఆర్‌ శంఖుస్థాపన చేశారు. పట్టణంలో ప్రధానరోడ్లు, విద్యుత్ టవర్ల నిర్మాణానికి రూ. 148 కోట్లు విడుదల చేశారు. ఆ తరువాత మూడేళ్ళలో రూ.350 కోట్లు మంజూరు అయ్యాయి. వాటితో జిల్లాలోని ఇతర ప్రాంతాలను జిల్లా కేంద్రంతో కలుపుతూ రోడ్లు నిర్మిస్తున్నారు. అవి పూర్తయితే జిల్లా వ్యాప్తంగా సువిశాలమైన రోడ్లు ఏర్పడతాయి. వీటికి తోడు కరీంనగర్‌ స్మార్ట్ సిటీగా ఎంపికైనందుకు కేంద్రం నుంచి అదనంగా మరో రూ.242 కోట్లు లభించనున్నాయి. వాటితో పట్టణంలో రోడ్లు, పార్కులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వగైరాలన్నీ ఏర్పాటు అవుతున్నాయి.     

కరీంనగర్‌ పట్టణం, జిల్లా అభివృద్ధి కోసం మంత్రి గంగుల కమలాకర్ మరింత చొరవ తీసుకొంటుండటం చాలా అభినందనీయం. ఆయన కృషితో మానేరు నదిపై కేబిల్ బ్రిడ్జి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.184 కోట్లు మంజూరు చేసింది. మానేరు రివర్ ఫ్రంట్ కోసం అదనంగా రూ. 504 కోట్లు మంజూరు చేసింది. కరీంనగర్‌లో ఐ‌టి టవర్ ఏర్పాటు కోసం రూ.32 కోట్లు సాధించారు. దిగువ మానేరును పర్యాటక ఆకర్షణ కేంద్రంగా మార్చి అక్కడ  రూ.20 కోట్ల వ్యయంతో కేసీఆర్‌ ఐల్యాండ్ ఏర్పాటు చేశారు. స్పీడ్ బోట్స్, జెట్ బోట్స్ కూడా ఏర్పాటు చేశారు. 

కరీంనగర్‌లో జరుగుతున్న ఈ అభివృద్ధి పనులన్నీ పూర్తయితే హైదరాబాద్‌ తరువాత స్థానంలో నిలవడం ఖాయం. జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టుదలగా కృషి చేస్తే జిల్లా ఏవిధంగా అభివృద్ధి చెందుతుందో తెలుసుకొనేందుకు కరీంనగర్‌, సిరిసిల్లా, సిద్ధిపేట, సూర్యపేటలను చూస్తే అర్ధం అవుతుంది. కనుక రాష్ట్రంలో మిగిలిన జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తమ తమ జిల్లాల అభివృద్ధి కోసం గట్టిగా కృషి చేస్తే రాష్ట్రమంతా సమానంగా అభివృద్ధి చెందుతుంది కదా?


Related Post