కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీయే దిక్కా?

December 06, 2019


img

లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయానికి నైతిక బాద్యత వహిస్తూ రాహుల్ గాంధీ జూలై నెలలో పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. సుమారు 130 సం.ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి నాయకత్వ సమస్యతో సతమతమవుతోంది. ఆ పదవిని చేపట్టడానికి పార్టీలో చాలా మంది సీనియర్లు ఉన్నప్పటికీ పార్టీలో నేతలు, కార్యకర్తలు ఎవరూ వారి నాయకత్వాన్ని ఇష్టపడటం లేదు. కనుక ఆ పదవిని ఎవరు చేపట్టినా యావత్ దేశంలో విస్తరించి ఉన్న కాంగ్రెస్ నేతలను, శ్రేణులను నియంత్రించి ఒక్క తాటిపై నడిపించలేని నిసహాయత ఏర్పడుతుంది. కనుక పార్టీలో చీలికలు వచ్చే అవకాశం ఉంది. బహుశః ఈ కారణంగానే మళ్ళీ సోనియా గాంధీకి తాత్కాలికంగా పార్టీ పగ్గాలు కట్టబెట్టారు. అయితే ఆరోగ్యకారణాల చేత ఆమె ఇదివరకులా పార్టీని దూకుడుగా నడిపించలేకపోతున్నారు. కనుక మళ్ళీ రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చెప్పట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. 

ఈవిషయం రాహుల్ గాంధీ కూడా గ్రహించడంతో మళ్ళీ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు సానుకూలంగానే ఉన్నట్లు తొలి సంకేతాలు వెలువడ్డాయి. రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టడం అనివార్యంగా కనిపిస్తోందని, జనవరిలో ఏఐసిసి సమావేశం నిర్వహించి రాహుల్ గాంధీని కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నుకొనే అవకాశం ఉందంటూ కాంగ్రెస్‌ సీనియర్ నేత కేసి వేణుగోపాల్ కేరళ పర్యటనలో సూచన ప్రాయంగా తెలిపారు. అయితే అది సూచన కాదు..నిర్ణయమేనని భావించవచ్చు. 

ఎందుకంటే, అధ్యక్ష పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ఇంతకాలం పార్టీ వ్యవహారాలకు కాస్త దూరంగా ఉంటున్న రాహుల్ గాంధీ, గత కొన్ని రోజులుగా మళ్ళీ చురుకుగా పాల్గొంటూ ప్రధాని నరేంద్రమోడీపై విరుచుకు పడుతుండటం గమనిస్తే త్వరలోనే ఆయన పార్టీ పగ్గాలు చేపట్టబోతున్నట్లు భావించవచ్చు. అయితే 130 సం.ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ కుటుంబం తప్ప వేరెవరూ నడిపించలేకపోవడం బలమా బలహీనతా? ఆలోచించుకొంటే మంచిదేమో?


Related Post