10 మంది ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు

December 06, 2019


img

ఆర్టీసీ సమ్మె సమయంలో సుమారు 30మందికి పైగా ఆర్టీసీ కార్మికులు మృతి చెందడం, వారి కుటుంబాలను ఆదుకొంటామని సిఎం కేసీఆర్‌ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒక్కో కుటుంబంలో అర్హులైనవారికి ప్రభుత్వోద్యోగం రూ.2 లక్షల నష్టపరిహారం ఇస్తామని సిఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఆ ప్రకారమే ముందుగా జీహెచ్‌ఎంసీ పరిధిలో మృతి చెందిన 10 మంది ఆర్టీసీ కార్మికుల కుటుంబాల నుంచి ఒక్కొక్కరికి శుక్రవారం సంబంధిత శాఖల అధికారులు ఉద్యోగ నియామకపత్రాలు అందజేశారు. ఐదుగురికి పోలీస్ కానిస్టేబుల్, నాలుగురిని జూనియర్ అసిస్టెంట్, ఒకరిని ఆర్టీసీ కండక్టరుగా ఉద్యోగాలు కల్పిస్తూ నియామకపత్రాలు అందజేశారు. అందరూ తక్షణమే విధులలో చేరాలని అధికారులు సూచించారు. త్వరలోనే ఇతర జిల్లాలో చనిపోయిన మిగిలిన 20 మంది ఆర్టీసీ కార్మికుల కుటుంబ సభ్యులకు కూడా వారి అర్హతకు తగిన ఉద్యోగాలు కల్పించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఆర్టీసీ కార్మికులు చనిపోతున్నప్పుడు వారి కుటుంబ సభ్యులతో సహా ఆర్టీసీ కార్మికులు తమ ఉసురు తగులుతుందంటూ సిఎం కేసీఆర్‌కు శాపనార్ధాలు పెట్టారు. అయితే వారి మరణాలకు ఆర్టీసీ జేఏసీ నేతలు, ప్రతిపక్షాలే కారకులని కనుక వారే అందుకు బాధ్యత వహించాలని అప్పుడు సిఎం కేసీఆర్‌ గట్టిగా వాదించినప్పటికీ, చివరకు ఆర్టీసీ కార్మికులపై జాలిపడో...లేదా వారి ఉసురు తగులుతుందనే భయంతోనో ఈవిధంగా ప్రాయశ్చితం చేసుకొంటున్నట్లు భావించవలసి ఉంటుంది. అయితే ఇప్పుడు వారికి ఎంత ఇచ్చినా... ఏమి చేసినా కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయిన ఆ లోటును ఎవరూ తీర్చలేరు కదా. త్వరలోనే మిగిలిన ఆర్టీసీ కార్మికుల కుటుంబ సభ్యులకు కూడా ఉద్యోగాలు ఇస్తే వారూ మళ్ళీ తేరుకోగలుగుతారు.


Related Post