దిశ ఎన్‌కౌంటర్ సరైనదేనా?

December 06, 2019


img

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతానికి భారీ సంఖ్యలో చేరుకొన్న ప్రజలు అక్కడ ఉన్న పోలీసులపై పూలు జల్లుతూ తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినీ ప్రముఖులు కూడా ఈ ఎన్‌కౌంటర్‌పై హర్షం వ్యక్తంచేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 

ప్రముఖ నటుడు మంచు మనోజ్ స్పందిస్తూ, ‘ఆ బుల్లెట్టు దాచుకోవాలని ఉంది.. తుపాకీలకు దండం పెట్టుకోవాలని ఉంది.. ఆ పోలీసుల కాళ్లు మొక్కాలని ఉంది.. నలుగురు చచ్చారు అనే వార్తలో ఇంత కిక్కు ఉందా? ఈ రోజు నీ ఆత్మ దేవుడిని చేరింది చెల్లెమ్మా’ అంటూ ట్విట్టర్‌లో మెసేజ్ పెట్టారు. వివిద రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఎన్‌కౌంటర్‌పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


దిశకు న్యాయం జరగాలని కోరుకొంటున్నవారు ఈ విధంగా స్పందించడం సహజమే. అయితే ప్రజల స్పందన చూస్తుంటే నిందితులు తప్పించుకొని పారిపోతుంటే పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసినట్లు కాక, తమ భావోద్వేగాలకు అనుగుణంగా వారిని అక్కడకు తీసుకువెళ్లి కాల్చి చంపారనే భావం స్పష్టంగా కనిపిస్తోంది. ఘటనా స్థలంకు భారీ సంఖ్యలో చేరుకొన్న ప్రజలు అక్కడ ఉన్న పోలీసులపై ప్రజలు పూలు జల్లుతూ ‘తెలంగాణ పోలీస్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేయడమే అందుకు ఒక చక్కటి ఉదాహరణ. 


ఈ ఎన్‌కౌంటర్‌ గురించి పోలీసులు చెప్పబోయే విషయాన్ని కాసేపు పక్కన పెడితే, చట్టప్రకారం ఆ నలుగురు దోషులని కోర్టులో ఖచ్చితంగా నిరూపించక మునుపే ఎన్‌కౌంటర్‌ అవడం సరికాదనే చెప్పక తప్పదు. ఎందుకంటే, ఇటువంటి కేసులలో ప్రజల భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకొని నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడం మొదలుపెడితే, కేసుల ఒత్తిడి నుంచి బయటపడటానికి పోలీసులు ఆ కేసుతో ఎటువంటి సంబందమూ లేని నిర్దోషులను దోషులుగా చూపించి ఎన్‌కౌంటర్‌ చేసే ప్రమాదం ఉంటుంది. 

ముంబై దాడులలో వందలాది మంది మందిని పొట్టన పెట్టుకొన్న కసాబ్ వంటి కరడుగట్టిన ఉగ్రవాదిని ‘అతను దోషి’ అని ఖచ్చితంగా నిరూపించిన తరువాతే ఉరి తీశారు. నిర్భయ కేసులో కూడా నిందితులను దోషులుగా కోర్టులో నిరూపించిన తరువాతే వారికి ఉరి శిక్షలు విధించబడ్డాయి. అయితే ఆ కేసులు ఏళ్ళ తరబడి సాగడం వలన కోర్టులు దోషులను వెంటనే శిక్షించలేకపోతున్నాయని ప్రజలు తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందుకే దిశ కేసులో ప్రజలు నిందితులకు వెంటనే శిక్షలు పడాలని పోలీసులపై తద్వారా ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి చేశారని చెప్పవచ్చు. 

అందుకే దిశ కేసులో నలుగురు నిందితులను విచారించేందుకు ప్రభుత్వం వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసింది. ఆ నలుగురిని దోషులని నిరూపించేందుకు పోలీసులు పక్కా సాక్ష్యాధారాలు సేకరించారు కూడా. కనుక ఒకటి రెండు నెలలోగానే నలుగురికి చట్టప్రకారం కటిన శిక్షలు పడి ఉండేవి. కానీ ఎన్‌కౌంటర్‌తో కేసు ముగిసిపోయింది. దీంతో ప్రజల భావోద్వేగాలు చల్లారి ఉండవచ్చు కానీ ఇది సరైన ముగింపు కాదనే చెప్పక తప్పదు.  

ఇటువంటి కేసులను నిర్భయ కేసులాగ ఏళ్ళ తరబడి సాగదీయకుండా వీలైనంత త్వరితంగా విచారణ జరిపి నేరస్తులకు అత్యంత కటినమైన శిక్షలు విధించడమే సరైన విధానం తప్ప ఎన్‌కౌంటర్‌ సరైన ముగింపు కాదనే చెప్పాలి. అయితే తీవ్ర భావోద్వేగాలతో ఉన్న ప్రజలు, ప్రముఖులు ఎవరూ ఈ వాదనతో ఏకీభవించరని అందరికీ తెలుసు.


Related Post