మజ్లీస్‌కు పీఏసీ... తెరాసకు ఎన్ఓసీ!

December 05, 2019


img

తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తెరాసలోకి ఫిరాయింపజేసుకోవడంతో శాసనసభలో కాంగ్రెస్ బలం తగ్గిపోయింది. దాంతో కాంగ్రెస్‌ పార్టీ శాసనసభలో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. తెరాసకు మిత్రపక్షంగా ఉంటున్న మజ్లీస్‌కు అది దక్కింది. కనుక శాసనసభలో తెరాస సర్కార్‌ను గట్టిగా ప్రశ్నించేవారు లేరిపుడు. తాజాగా మజ్లీస్‌కు కీలకమైన ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) పదవి కూడా లభించింది. తెరాస సర్కార్‌ మజ్లీస్‌ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ పీఏసీ ఛైర్మన్‌ పదవి కట్టబెట్టింది. గురువారం అక్బరుద్దీన్ అధ్యక్షతన మొదటిసారిగా పీఏసీ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసన మండలి ఛైర్మన్‌ గుత్తాసుఖేందర్‌రెడ్డి, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కమిటీ సభ్యులు డి.శ్రీధర్ బాబు, సండ్ర వెంకట వీరయ్య, రమావత్ రవీందర్ కుమార్ తదితరులు హాజరయ్యారు.

కీలకమైన పీఏసీ పదవిని ప్రతిపక్ష నేతకు కట్టబెట్టడం ఆనవాయితీ. మజ్లీస్‌ కూడా ప్రతిపక్ష పార్టీయే కనుక దానికి ఈ పదవిని కట్టబెట్టడం సాంకేతికంగా సరైనదే. కానీ తెరాసకు మిత్రపక్షంగా ఉన్న మజ్లీస్‌కు ఆ పదవిని కట్టబెట్టడం వలన తెరాస సర్కార్‌ చేసే ఖర్చులపై అది గట్టిగా నిలదీయదని వేరే చెప్పనవసరం లేదు. శాసనసభలో ఎదురులేకుండా చేసుకొన్న తెరాస పద్దుల విషయంలో కూడా ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడిందని చెప్పవచ్చు. మరోవిధంగా చెప్పాలంటే మజ్లీస్‌కు పీఏసీ...తెరాసకు ఎన్ఓసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్)! 


Related Post