నిజమే! ఆర్ధికశాఖ పూలపాన్పు కాదు

December 05, 2019


img

హైదరాబాద్‌ ఐటీసీ కాకతీయ హోటల్‌లో‌  సీఐఐ ఆధ్వర్యంలో గురువారం సీ.ఎఫ్.వో కాంక్లెవ్-2019 సమావేశానికి హాజరైన రాష్ట్ర ఆర్ధికమంత్రి హరీష్‌రావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

 “కంపెనీలకు చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్లు (సీ.ఎఫ్.వో)లు గుండెవంటివారు. వారు నిరంతరం తీవ్ర ఒత్తిడితో పనిచేస్తూనే ఉంటారు. అప్పుడే వారి కంపెనీలు సజావుగా నడుస్తుంటాయి. గతంలో సాగునీటిశాఖా మంత్రిగా చేసినప్పుడు సిఎం కేసీఆర్‌ నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం పనిచేసుకుపోతుండేవాడిని. కానీ ఇప్పుడు ఆర్ధికమంత్రిగా చాలా భిన్నమైన బాధ్యత నిర్వర్తిస్తున్నాను. రాష్ట్రాభివృద్ధికి, సంక్షేమ పధకాలకు అవసరమైన నిధులను సమకూర్చుకొంటుండాలి. కనుక నేను కూడా మా ప్రభుత్వంలో సీ.ఎఫ్.వో. వంటివాడినే. ఆర్టీసీకి సిఎం కేసీఆర్‌ వరాలు ప్రకటిస్తున్నప్పుడు కొంచెం కంగారు పడ్డాను. అయితే సిఎం కేసీఆర్‌ నేతృత్వంలో ఒక్కో సమస్యను పరిష్కరించుకొని ముందుకు సాగుతూ అద్భుతమైన ప్రగతి సాధించాము. ఐ‌టి, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌  రాష్ట్రానికి చాలా బారీగా పెట్టుబడులను ఆకర్షించగలిగారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని చూసి బ్యాంకులు కూడా పరిశ్రమలకు రుణాలు ఇచ్చేందుకు రుణమేళాలు నిర్వహిస్తున్నాయి. ఇది చాలా శుభపరిణామం,” అని అన్నారు. 

ఏపీతో పోలిస్తే తెలంగాణ ఆర్ధిక పరిస్థితి చాలా బాగానే ఉందని చెప్పవచ్చు. పైగా సిఎం కేసీఆర్‌ ప్రజలను మంచి చేసుకోవడం కోసం ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డిలా వరాలు ప్రకటించకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేయడానికి, రాష్ట్రంలో అభివృద్ధి పనుల, సంక్షేమ పధకాలు అమలుకు చాలా బారీగా నిధులు అవసరం ఉంటుంది. ప్రాజెక్టుల కోసం చేసిన అప్పులకు వడ్డీలు కూడా టంచనుగా చెల్లిస్తుండాలి. దేనికీ నిధులు కోత విధించకుండా చాలా జాగ్రత్తగా సర్దుబాట్లు చేయాల్సి ఉంటుంది. కోతలు విధిస్తే సంబందిత శాఖలో పనులు నిలిచిపోయినా  లేదా నత్త నడకలు నడిచినా తెరాసకు రాజకీయంగా ఇబ్బందికరంగా మారుతుంది. కనుక ఆర్ధికశాఖ నిర్వహణ అంటే కత్తిమీద సామే తప్ప పూలపాన్పు కాదనే చెప్పాలి. 

సాగునీటి శాఖా మంత్రిగా చాలా సమర్ధంగా పనిచేసి ప్రాజెక్టులను పరుగులు పెట్టించి సకాలంలో పూర్తి చేసిన హరీష్‌రావు ఇప్పుడు అంతకంటే క్లిష్టమైన ఆర్ధికశాఖను ఏవిధంగా నడిపిస్తున్నారిప్పుడు. మొదటిసారి ఆయన సిఎం కేసీఆర్ తయారుచేసిన ప్రవేశపెట్టిన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు తప్ప సొంతంగా తయారు చేసిందికాదు. కనుక ఆయన ఆర్ధికశాఖను ఏవిదంగా నిర్వహిస్తున్నారో తెలియాలంటే వచ్చే బడ్జెట్‌ వరకు ఎదురు చూడాల్సిందే! 


Related Post