దిల్‌సుక్‌నగర్‌ వద్ద తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు ధర్నా

December 05, 2019


img

ఆర్టీసీ సమ్మె జరుగుతున్నప్పుడు 55 రోజులు ప్రజలకు సేవలు అందించిన తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు తమను ఆర్టీసీలోకి తీసుకోవాలని కోరుతూ మంగళవారం దిల్‌సుక్‌నగర్‌ డిపో వద్ద ధర్నా చేశారు. 

సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికుల ఛీత్కారాలు ఎదుర్కొంటూ 55 రోజులపాటు ప్రజలకు ఆర్టీసీకి సేవలందించామని, సమ్మె విరమణతో ఒకేసారి ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ సమ్మె సమయంతో సేవలందించిన తమను ప్రభుత్వం గుర్తించిందని, భవిష్యత్‌లో వారందరికీ తప్పకుండా ప్రాధాన్యం ఇస్తుందని సిఎం కేసీఆర్‌ చెప్పారని కనుక తమను ఆర్టీసీలోకి తీసుకొని ఆదుకోవాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

ఆర్టీసీ సమ్మె సందర్భంగా ఆర్టీసీ పరిస్థితి కళ్ళకు కట్టినట్లు కనపడింది. ఈ పరిస్థితులలో ఉన్న ఉద్యోగులనే భారంగా భావిస్తున్నప్పుడు అదనంగా మరో 3-4,000 మంది తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకొంటుందని ఆశించలేము. కనుక ఆర్టీసీ పరిస్థితి పూర్తిగా మెరుగుపడేవరకు వారు ఓపిక పట్టక తప్పదు. అయితే ఆర్టీసీ పరిస్థితి ఎప్పటికీ మెరుగుపడుతుంది? అని ఆలోచిస్తే సమాధానం లభించదు.  

నష్టాల ఊబిలో కూరుకుపోయున్న ఆర్టీసీ ప్రస్తుత పద్దతిలోనే నడిస్తే ఇంకా నష్టాలే తప్ప లాభాలు రావని స్పష్టం అయ్యింది. కనుక ఆర్టీసీని ఆదుకొనేందుకు ప్రభుత్వం మళ్ళీ నిధుల విడుదలకు సిద్దమైంది కానీ ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏవైనా ప్రణాళికలు సిద్దం చేస్తోందా లేదా? తెలియదు. ఆర్టీసీని ఏడాదిలోగా లాభాల బాట పట్టిస్తానని సిఎం కేసీఆర్‌ అన్నారు. కానీ ఇంతగా నష్టపోయిన ఆర్టీసీ ఏడాదిలోనే కోలుకోగలిగితే అది చాలా గొప్ప విషయమే అవుతుంది. కనుక అంతవరకు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు డిపోల ముందు ధర్నాలు చేస్తూ సమయం వృధా చేసుకోవడం  కంటే తమ అర్హతలకు తగిన ఉద్యోగాలు లేదా ఉపాది వెతుకోవడం చాలా మంచిది. 


Related Post