కేటీఆర్‌ ప్రశ్నలకు బదులిచ్చేవారెవరు?

December 05, 2019


img

తెలంగాణతో సహా దక్షిణాది రాష్ట్రాలపట్ల  కేంద్రప్రభుత్వం వివక్ష చూపుతోందని మంత్రి కేటీఆర్‌ నిన్న చేసిన వ్యాఖ్యలపై కేంద్రప్రభుత్వం ఎలాగూ స్పందించదు. రాష్ట్ర బిజెపి నేతలు ఏవిధంగా స్పందిస్తారో తేలికగానే ఊహించుకోవచ్చు. అయితే దేశంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్రప్రభుత్వం కూడా గుర్తించినప్పటికీ, రాష్ట్రాభివృద్ధికి తగినంత చేయూతనీయలేకపోవడం విచారకరమే. దేశంలో అత్యదిక పన్ను వసూలు అవుతున్న రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రం నుంచి కేంద్రానికి బారీగా ఆదాయం వస్తున్నప్పుడు అందుకు తగ్గట్లుగానైనా నిధులు విడుదల చేస్తుండాలి. కానీ జిఎస్టీ పన్నులలో రాష్ట్ర వాటా కోసం తెచ్చుకోవడానికి కూడా అధికారులు డిల్లీ చుట్టూ తిరుగవలసి వస్తోందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. 

కేంద్రప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి సహకరించినా సహకరించకపోయినా, బిజెపి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కోరుకోవడం మరో విశేషం. రాష్ట్రంలో బలపడేందుకు చూపిస్తున్న ఆసక్తి రాష్ట్రాభివృద్ధిపై ఎందుకు చూపించడం లేదని తెరాస ప్రశ్నకు బిజెపి నేతలే సమాధానం చెప్పాలి. 

తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్రంలో శరవేగంగా పారిశ్రామిక, మౌలికవసతుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో బారీ పరిశ్రమలు స్థాపించడానికి కేంద్రప్రభుత్వం ముందుకు రాకపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టిఎస్ ఐపాస్ పాలసీతో గత 5 ఏళ్ళలో అనేక చిన్న, మద్యస్థాయి ప్రైవేట్ పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. కనుక పారిశ్రామికాభివృద్ధి విషయంలో కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి సాయపడకపోయినా, మౌలిక వసతుల కల్పన, విద్యా, వైద్యం, విద్యుత్, రైల్వే, వ్యవసాయ తదితర రంగాల అభివృద్ధికి రాష్ట్రానికి అవసరమైన సహాయసహకారాలు అందజేసినట్లయితే తెలంగాణ రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది. తద్వారా దేశ ఆర్ధికవ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తుంది కదా?


Related Post