కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాలు కనబడవా? కేటీఆర్‌

December 04, 2019


img

తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన టిఎస్ఐపాస్‌ పాలసీకి 5 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ నేడు శిల్పకళావేదికలో జరిగిన అవార్డుల ఫంక్షన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేవలం ఐదున్నరేళ్లే అయినప్పటికీ దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీ పడే స్థాయికి ఎదిగింది. మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన టిఎస్ఐపాస్‌ పాలసీతో రాష్ట్రానికి వేలకోట్లు పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చాయి. రాష్ట్రంలో గణనీయంగా పారిశ్రామిక అభివృద్ధి జరిగింది. తద్వారా లక్షలాదిమందికి ఉద్యోగఉపాది అవకాశాలు లభించాయి. తెలంగాణ పారిశ్రామికాభివృద్ధితో దేశ ఆర్ధిక ప్రగతికి ఎంతో మేలు కలిగింది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ వంటి రాష్ట్రాలను కేంద్రప్రభుత్వం గుర్తించి వాటికి ఉదారంగా సహాయసహకారాలు అందిస్తే మరింత ప్రగతి జరుగుతుంది తద్వారా దేశాభివృద్ధి జరుగుతుంది. కానీ దురదృష్టవశాత్తూ కేంద్రప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదు. పారిశ్రామిక కారిడార్‌ అంటే డిల్లీ ముంబై మద్యనే ఉండాలనుకొంటుంది తప్ప హైదరాబాద్‌-బెంగళూరు-చెన్నై మద్య ఏర్పాటుచేయాలని అనుకోదు. అలాగే బులెట్ రైల్‌ గుజరాత్-మహారాష్ట్ర మద్య ఏర్పాటు చేస్తుంది తప్ప హైదరాబాద్‌లోనో లేదా దక్షిణాదిరాష్ట్రాలలోనో ఏర్పాటు చేయాలనుకోదు. దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపుతుండటంతో అభివృద్ధికి బ్రేకులు పడుతున్నాయి. పారిశ్రామిక అభివృద్ధికి రాజకీయలతో ముడిపెట్టి చూడకుండా అభివృద్ధిని ప్రామాణికంగా తీసుకొని కేంద్రం సహాయసహకారాలు అందించాలని కోరుకొంటున్నాను,” అని అన్నారు. 

“మనం పారిశ్రామికంగా ఎదిగి ప్రపంచదేశాలతో పోటీపడాలంటే చిన్న, మధ్యతరగతి పరిశ్రమలను ప్రోత్సహించాలనే ఆలోచనతోనే సిఎం కేసీఆర్‌టిఎస్ఐపాస్‌ పాలసీని రూపొందించి విజయవంతంగా అమలుచేస్తున్నారు. అది యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో అమలుచేస్తునన్ని సంక్షేమ పధకాలు దేశంలో మరెక్కడా అమలుచేయడం లేదు. కేవలం ఐదున్నరేళ్లలో ఇంతగా ప్రగతి సాధించినప్పటికీ కేంద్రప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయసహకారాలు లభించకపోవడం చాలా బాధాకరం. ఇకనైనా కేంద్రప్రభుత్వం ఈ సవతితల్లి ధోరణి వీడి తెలంగాణతో సహా దక్షిణాది రాష్ట్రాలకు సహాయసహకారాలు అందించాలని కోరుతున్నాను,” అని అన్నారు.   

రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి అందిస్తున్న సహాయసహకారాల గురించి కేటీఆర్‌ మాట్లాడుతూ, “ప్రభుత్వం పారిశ్రామిక సంస్థలను ప్రోత్సహించేందుకు రూ.350 కోట్ల రాయితీలు ఇచ్చింది. కానీ దానికీ కొందరు వక్రబాష్యాలు చెపుతున్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న ఈ టిఎస్ఐపాస్‌ పాలసీ వలన రాష్ట్రంలో ఏర్పాటైన భారీ పరిశ్రమలు 30 శాతం, మీడియం, చిన్న పరిశ్రమలు 70 శాతం ఉపాధి కల్పిస్తున్నాయి. మనదేశం చైనాతో పోటీ పడాలంటే సూక్ష, చిన్న పరిశ్రమలను ప్రోత్సహించాలి. అలాగే మెగా పార్కులు ఏర్పాటుచేసుకోవాలి. త్వరలోనే హైదరాబాద్‌ ఫార్మా సిటీ పనులను ప్రారంభించబోతున్నాము,” అని మంత్రి కేటీఆర్‌ అన్నారు.


Related Post