పార్టీలో నన్ను పట్టించుకొనేవారే లేరు: రాజా సింగ్

December 03, 2019


img

తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌తో సహా పార్టీలో హేమాహేమీలు అందరూ ఓడిపోయారు. ఆ ఎన్నికలలో బిజెపి ఒకే ఒక సీటు గెలుచుకోగలిగింది. ఘోషామహల్ నుంచి రాజాసింగ్ ఒక్కరే ఎమ్మెల్యేగా గెలిచారు. 

శాసనసభలో ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న తనను బిజెపి ఎల్పీ నేతగా గుర్తించడంలేదని రాజా సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పార్టీలో తనను పట్టించుకొనేవారే లేరని అన్నారు. పార్టీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న బండి సంజయ్, ధర్మపురి అరవింద్, డికె.అరుణ ముగ్గురూ సమర్దులేనని వారిలో ఎవరికి ఆ పదవి లభించినా తనకు సంతోషమేనని  అన్నారు. సికింద్రాబాద్‌ నుంచి ఎంపీగా ఎన్నికైన జి.కిషన్‌రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి చేపట్టడం చాలా ఆనందం కలిగిస్తోందని అయితే ఆయన తన నియోజకవర్గంలో పర్యటించేటప్పుడు తనకు ముందుగా సమాచారం ఇవ్వకపోవడం చాలా బాధ కలిగిస్తోందన్నారు. ఏ పార్టీకి చెందినవారైనా సరే ప్రోటోకాల్ పాటించడం మర్యాద అని రాజా సింగ్‌ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో పార్టీలో కొందరు తనకు వ్యతిరేకంగా పనిచేసి ఓడించాలని విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ, కార్యకర్తలు తనను గెలిపించుకొన్నారని అందుకు వారికి ఎప్పటికీ ఋణపడి ఉంటానని అన్నారు. తనకు పదవుల కంటే గోసేవ, హిందూ పరిరక్షణ కార్యక్రమాలపైనే ఆసక్తి ఎక్కువని రాజా సింగ్ అన్నారు. 

రాష్ట్ర బిజెపిలో రాజా సింగ్‌ మొదటి నుంచి ఒంటరిగానే ఉంటున్నారు లేదా ఆయన చెపుతునట్లు పార్టీ నేతలే ఆయనను దూరంగా ఉంచుతున్నారని చెప్పుకోవలసి ఉంటుంది. అయినప్పటికీ రాష్ట్ర బిజెపి తరపున తెరాస సర్కార్‌తో ఆయన గట్టిగానే పోరాడుతుంటారు. కానీ పార్టీలో ఆయనకు తగిన గుర్తింపు లభించలేదనే చెప్పవచ్చు. ఒకానొక సమయంలో ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతారనే ఊహాగానాలు కూడా వినిపించాయి కానీ ఆయనకు పార్టీలో నేతలకు దూరం ఉన్నప్పటికీ నేటికీ ఆయన పార్టీనే అంటిపెట్టుకొని ఉన్నారు.


Related Post