కాంగ్రెస్‌, బిజెపి ఎంపీలు డిల్లీలో ఏం చేస్తున్నారు?

December 03, 2019


img

ప్రస్తుతం పార్లమెంటు శీతాకాల సమావేశాలు నడుస్తున్నందున తెలంగాణకు చెందిన తెరాస, కాంగ్రెస్‌, బిజెపి ఎంపీలు డిల్లీలో చాలా బిజీగా ఉన్నారు. తెరాస ఎంపీలు రాష్ట్రానికి రావలసిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులను సాధించుకోవడానికి, రాష్ట్రానికి సంబందించిన సమస్యల పరిష్కారం కోసం కేంద్రమంత్రుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంటే, కాంగ్రెస్‌, బిజెపి ఎంపీలు మాత్రం పార్లమెంటులో ‘దిశ కేసు’పై గట్టిగా మాట్లాడుతున్నారు. ఇది చాలా తీవ్రమైన సమస్య కనుక దానిపై పార్లమెంటులో జరుగుతున్న చర్చలో పాల్గొని ప్రజల గొంతు వినిపించడం అభినందనీయమే కానీ సమావేశాలు జరుగుతున్నప్పుడే రాష్ట్రానికి సంబందించిన సమస్యల గురించి పార్లమెంటులో ప్రస్తావించి, వాటి పరిష్కారాల కోసం కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి చేయడం కూడా చాలా అవసరం. ఒకవేళ దాని వలన ప్రయోజనం ఉండదని వారు భావిస్తే వాటి కోసం ప్రయత్నాలు చేస్తున్న తెరాస ఎంపీలతో కలిసి వెళ్ళి కేంద్రమంత్రులతో మాట్లాడి ఒప్పించగలిగితే రాష్ట్రానికి మేలు కలుగుతుంది...ప్రజలు కూడా హర్షిస్తారు. 

ఆర్టీసీ సమ్మె జరుగుతున్నప్పుడు రాష్ట్ర స్థాయిలో పరిష్కారం కావడం లేదని గ్రహించిన బిజెపి, కాంగ్రెస్‌ ఎంపీలు నేరుగా కేంద్రమంత్రి నితిన్ గడ్కారీని కలిసి సమస్య పరిష్కారించవలసిందిగా కోరారు. వారు ఆవిధంగా చొరవ తీసుకొని కేంద్రమంత్రితో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం కృషి చేసినందుకు ఆర్టీసీ కార్మికులు, ప్రజలు కూడా సంతోషించారు. అప్పుడు ఆ అంశంపై మాట్లాడగలిగినప్పుడు, ఇప్పుడు రాష్ట్రానికి రావలసిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల గురించి కూడా వారు కేంద్రమంత్రులతో మాట్లాడవచ్చు కదా? 

కాంగ్రెస్‌, బిజెపిలు తెరాసతో రాజకీయంగా విభేధిస్తే ఎవరూ కాదనరు కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం తెరాసతో కలిసి కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే అందరూ హర్షిస్తారు. కానీ కాంగ్రెస్‌, బిజెపి ఎంపీలు ‘దిశ కేసు’ గురించి మాత్రమే గట్టిగా  మాట్లాడుతున్నారు తప్ప రాష్ట్రానికి రావలసిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల గురించి పార్లమెంటులో గట్టిగా  మాట్లాడిన దాఖలాలు లేవు. 

రాష్ట్రానికి లబ్ది చేకూర్చే ప్రయత్నాలు చేయకుండా రాష్ట్రంలో జరుగుతున్న అవాంఛనీయమైన ఘటనల గురించి కేంద్రానికి ఫిర్యాదు చేయడానికే వారు పరిమితమయితే ప్రజలు హర్షించరని గ్రహిస్తే మంచిది. రాష్ట్రానికి ఏదో మేలు చేస్తారనే ఉద్దేశ్యంతోనే ప్రజలు తమను ఎంపీలుగా ఎన్నుకొన్నారని వారు మరిచిపోకూడదు. కాంగ్రెస్‌, బిజెపి ఎంపీలు ఇంతవరకు రాష్ట్రానికి ఏమి మేలు చేశారు? అనే తెరాస ప్రశ్నకు వారు సమాధానం చెప్పగలరా? రాష్ట్రానికి ఏమీ చేయలేనప్పుడు మిమ్మల్ని ఎన్నుకొని ఏమి ప్రయోజనం? అని ప్రజలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పగలరా? అటువంటి ప్రశ్న ఎదురుకాక మునుపే మేల్కొంటే వారికే మంచిది కదా? 


Related Post