ఇప్పుడు కేసీఆర్‌ను నిందించి ఏం ప్రయోజనం?

November 29, 2019


img

ఆర్టీసీ సమ్మెను సిఎం కేసీఆర్‌ అనూహ్యంగా ముగించి కాంగ్రెస్‌, బిజెపిలకు నోట మాట రాకుండా చేశారు. ఆ రెండు పార్టీల నేతలు సిఎం కేసీఆర్‌పై మొక్కుబడిగా విమర్శలు చేయడంతోనే ఇది అర్ధమవుతుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కానీ కేంద్రంలోగానీ అధికారంలో లేకపోవడం వలన దానిని ఎవరూ నిందించలేరు. కానీ బిజెపి కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్ర బిజెపి నేతలు ఆర్టీసీ కార్మికులకు ఏమాత్రం సాయపడలేకపోయారు. కనీసం రాష్ట్రంలో బిజెపి బలపడేందుకు సిఎం కేసీఆర్‌ స్వయంగా అందించిన ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగపరుచుకోలేకపోయారు. సమ్మె ఉదృతంగా సాగుతున్నప్పటికీ, హైకోర్టులో ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగులుతున్నప్పటికీ, సమ్మె కారణంగా ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరిగినప్పటికీ, బిజెపి నేతలు కేసీఆర్‌ను విమర్శిస్తూ కాలక్షేపం చేశారే తప్ప కేంద్రంతో మాట్లాడి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించలేకపోయారు. చివరికి సిఎం కేసీఆరే స్వయంగా ఈ సమస్యకు ముగింపు పలికి ఆర్టీసీ కార్మికులు, రాష్ట్ర ప్రజల మన్నననలు అందుకోగలిగారు. 

కేసీఆర్‌ అందించిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయిన రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఇప్పుడు కేంద్రం, హైకోర్టు, గవర్నర్‌ ఒత్తిడి కారణంగానే సిఎం కేసీఆర్‌ దిగివచ్చారని వాదిస్తున్నారు. ఒకవేళ అదే నిజమనుకొన్నా దాని వలన సిఎం కేసీఆర్‌ ప్రతిష్ట ఇంకా పెరిగిందే తప్ప తగ్గలేదు కానీ బిజెపికి మాత్రం ఓరిగిందేమీ లేదు. ఇంతకాలం సిఎం కేసీఆర్‌ను ద్వేషించిన ఆర్టీసీ కార్మికులు సైతం ఇప్పుడు ఆయననే పొగుడుతున్నారు ఆయన చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తున్నారు తప్ప సమ్మెలో తమకు అండగా నిలిచిన కాంగ్రెస్‌, బిజెపిలను పొగడటం లేదు వారి ఫోటోలకు పాలాభిషేకాలు చేయడం లేదు కదా? అంటే ఆర్టీసీ సమ్మె నేపధ్యంలో జరిగిన ఈ పోరాటంలో కాంగ్రెస్‌, బిజెపిలు ఓడిపోగా సిఎం కేసీఆర్‌ విజేతగా నిలిచినట్లు అర్ధమవుతోంది. ఒకవేళ మున్సిపల్ ఎన్నికలలో తెరాస ఘన విజయం సాధించినట్లయితే ఇది మరోసారి నిర్ధారణ అవుతుంది.


Related Post