ఒకేదెబ్బకు అనేక పిట్టలు...కేసీఆర్‌కే సాధ్యం

November 29, 2019


img

ఆర్టీసీ సమ్మెకు అనూహ్యమైన ముగింపు పలకడం ద్వారా సిఎం కేసీఆర్‌ ఒకే దెబ్బకు అనేక పిట్టలు కొట్టారని చెప్పవచ్చు. సమ్మె సందర్భంగా పోలీసుల చేతిలో రక్తం కారేలా లాఠీ దెబ్బలు తిని, పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరిగిన ఆర్టీసీ కార్మికుల చేతే నేడు సిఎం కేసీఆర్‌ జేజేలు పలికించుకొన్నారు…పాలాభిషేకాలు కూడా చేయించుకోగలిగారు. అదీ... వారి ఒక్క డిమాండ్‌కు తలొగ్గకుండా...30 మంది ఆర్టీసీ కార్మికులు చనిపోయిన తరువాత ఆర్టీసీ కార్మికుల చేతే జేజేలు పలికించుకోవడం గొప్ప విషయమే.  

సమ్మేలో 30 మందికి పైగా ఆర్టీసీ కార్మికులు చనిపోయినప్పుడు సిఎం కేసీఆర్‌తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, తెరాస నేతలు ఎవరూ కూడా సానుభూతి చూపలేదు. కనీసం స్పందించలేదు. అందుకు ఆర్టీసీ కార్మికులే కాక ప్రతిపక్షాలు, రాష్ట్ర ప్రజలలో కూడా వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయింది. కానీ చనిపోయిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వోద్యోగం కూడా ఇస్తామనే ఒకే ఒక ప్రకటనతో సిఎం కేసీఆర్‌ ప్రజాగ్రహాన్ని చల్లార్చగలిగారని చెప్పవచ్చు. 

ఆర్టీసీ కార్మికులకు అండగా నిలిచిన ప్రతిపక్షాలకు ముఖ్యంగా కాంగ్రెస్‌, బిజెపిలకు సిఎం కేసీఆర్‌ నిన్నటి ఒకే ఒక ప్రకటనతో పూర్తిగా గాలి తీసేశారని చెప్పవచ్చు. కాంగ్రెస్‌, బిజెపిలు ఆర్టీసీ కార్మికులను ఎగద్రోయడం తప్ప వారికి ఏవిధంగాను సహాయపడలేవని కేసీఆర్‌ మొదటి నుంచి చెపుతున్న మాటే చివరికి నిరూపితమైంది. కనుక ఆర్టీసీ కార్మికులు మళ్ళీ ఎన్నడూ ప్రతిపక్షాల బుట్టలో పడవద్దనే చిన్న సందేశం వంటి హెచ్చరికతో సిఎం కేసీఆర్‌ వారిని  ప్రతిపక్షాలను దూరంగా ఉంచేలా చేయగలిగారు. 

ఆర్టీసీ సమ్మెతో ఒక్క ఆర్టీసీ కార్మికులకే కాదు... ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు, తాత్కాలిక ఉద్యోగులు అందరికీ కూడా ఒక గుణపాఠంగా మార్చడం ద్వారా భవిష్యత్‌లో యూనియన్లు లేదా ప్రతిపక్షాలు ముందుకు వచ్చినా కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు వారికి దూరంగా ఉంచవచ్చు.    

దీంతో ఇంతకాలం ఆర్టీసీ కార్మికులతో కలిసి పోరాటాలు చేసి ప్రజాధారణ పెంచుకొన్న కాంగ్రెస్‌, బిజెపిలను మళ్ళీ ప్రజల దృష్టిలో ‘జీరో’ చేసేసినట్లయింది. త్వరలోనే ఆర్టీసీ కార్మికులతో ప్రగతి భవన్‌లో సమావేశమయ్యి వారి సమస్యలను వింటానని, తరువాత వారికి విందు భోజనం తినిపిస్తానని కేసీఆర్‌ చెప్పారు. సమ్మె వలన తెరాస సర్కార్‌కు వచ్చిన చెడ్డపేరు దాంతో పూర్తిగా తొలగిపోవచ్చు. ఆర్టీసీ కార్మికులే సిఎం కేసీఆర్‌కు జైకొట్టి పాలాభిషేకాలు చేస్తున్నప్పుడు తెలంగాణ ప్రజలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తారనుకోలేము. కనుక త్వరలో జరుగబోయే మున్సిపల్ ఎన్నికలలో తెరాస ఘనవిజయం సాధించడం ఖాయంగానే కనిపిస్తోంది. 

సాధారణంగా ఆర్టీసీ ఛార్జీలు పెంచినప్పుడు ప్రతిపక్షాలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తుంటాయి. ప్రజల నుంచి వ్యతిరేకత కనిపిస్తుంటుంది. కానీ 52 రోజుల సమ్మెతో ఆర్టీసీ ఆర్ధిక పరిస్థితి ప్రజల కళ్ళకు కట్టినట్లు కనిపించింది. పైగా ఆర్టీసీ కార్మికులపై ప్రస్తుతం ప్రజలలో చాలా సానుభూతి నెలకొని ఉంది. కనుక ఛార్జీల పెంపును వ్యతిరేకించకపోవచ్చు. ఈ విషయం ప్రతిపక్షాలు కూడా గ్రహించే ఉంటాయి కనుక ఏదో పేరుకు ఖండన ప్రకటనలు, నిరసనలు చేసి మౌనం వహించవచ్చు. ఇంత బారీగా ఛార్జీలు పెంచినా ఏమాత్రం వ్యతిరేకత లేకుండా చూసుకోవడం కేసీఆర్‌కే చెల్లిందని చెప్పవచ్చు.      

అన్నిటి కంటే గొప్ప విషయం ఏమిటంటే ఇన్నాళ్ళుగా అందరి దృష్టిలో ‘విలన్’ గా కనిపించిన సిఎం కేసీఆర్‌, ఆర్టీసీ కార్మికులకు నయాపైసా కూడా ఇవ్వకుండా వారిని మళ్ళీ ఉద్యోగాలలోకి తీసుకోవడం ద్వారా హటాత్తుగా ‘హీరో’గా మారిపోగా, ఆర్టీసీ కార్మికులకు చివరి వరకు అండగా నిలబడిన కాంగ్రెస్‌, బిజెపి, టిజేఎస్‌,వామపక్షాలు, యూనియన్ నేతలు అందరినీ సిఎం కేసీఆర్‌ ‘విలన్లు’గా నిలబెట్టారు. కనుక కాంగ్రెస్‌, బిజెపి, వామపక్షాల ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మిగిలిపోయినట్లే చెప్పవచ్చు. 

సమ్మె కారణంగా ఒకానొక సమయంలో తెరాస లో చీలిక ఏర్పడవచ్చనే ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ తెరాసలో అందరినీ కట్టడి చేసి సిఎం కేసీఆర్‌ చివరికి తాను అనుకొన్నది సాధించారు. తద్వారా పార్టీపై, ప్రభుత్వంపై తిరుగులేని పట్టు ఉందని మరోసారి నిరూపించుకొని పార్టీలో ‘గులాబీ జెండా ఓనర్లు’ కూడా తాను గీసిన గీత దాటే సాహసం చేయలేరని నిరూపించి చూపగలిగారు.    

ఆర్టీసీ కార్మికుల పట్ల సిఎం కేసీఆర్‌ ప్రదర్శించిన కటిన వైఖరిని పక్కన పెడితే, ఒకే దెబ్బకు ఏకంగా ఇన్ని పిట్టలు కొట్టగలిగిన ఘనుడు కేసీఆర్‌ అని ఒప్పుకోకతప్పదు. ఈ ముగింపుకు కారణాలు ఏవైనప్పటికీ ఇది కేసీఆర్‌ రాజకీయ చాతుర్యానికి గొప్ప నిదర్శనంగా నిలుస్తుంది.


Related Post