అప్పుడు పూలు..జేజేలు! ఇప్పుడు రాళ్ళు...నిరసనలు!

November 28, 2019


img

ఏపీ మాజీ సిఎం చంద్రబాబునాయుడు ఇవాళ్ళ రాజధాని అమరావతిలో పర్యటిస్తున్నారు. ఆనాడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో అడుగుపెడితే చాలు ఆయనపై పూలవాన కురిసేది. హోరున జేజేధ్వానాలు వినిపించేవి కానీ ఇప్పుడు ఆయన ప్రయాణిస్తున్న బస్సుపై రాళ్ళ వర్షం కురిసింది. స్థానికులు నిరసనలు తెలియజేశారు. 

అధికార వైసీపీ నేతలే ప్రజలను, తమ కార్యకర్తలను రెచ్చగొట్టి చంద్రబాబుపై భౌతికదాడులు చేయించారని టిడిపి సీనియర్ నేత అచ్చం నాయుడు ఆరోపించారు. దానిని వైసిపి నేతలు ఖండించారు. 

జగన్ అధికారంలోకి రాగానే మొట్టమొదట కూల్చివేసిన ప్రజావేదిక వద్దకు చంద్రబాబునాయుడు వెళ్ళి చూశారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజా వేదికను కూల్చివేతతో రాష్ట్రంలో జగన్ వినాశకర పరిపాలన మొదలుపెట్టారని అన్నారు. అనంతరం ఆనాడు అమరావతి కోసం ప్రధాని నరేంద్రమోడీతో కలిసి శంఖుస్థాపన చేసిన స్థలాన్ని సందర్శించి అక్కడ మోకరిల్లి నమస్కరించారు. 

రాజధానితో రాష్ట్రానికి ఆదాయవనరు ఏర్పడుతుందని, రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం నిర్మాణపనులు చేపడితే, జగన్ సర్కార్ వాటిని నిలిపివేసి రాష్ట్రానికి తీరని నష్టం కలుగజేస్తోందని చంద్రబాబునాయుడు అన్నారు. 

టిడిపి ఆరోపిస్తున్నట్లు వైసీపీ నేతల ప్రోద్బలంతోనే చంద్రబాబునాయుడుకి నిరసనలు ఎదురై ఉండవచ్చు. కానీ 5 ఏళ్ళు సమయం లభించినా రాజధాని నిర్మాణ పనులు పూర్తిచేయకపోవడం కూడా నిరసనలకు మరో కారణమని భావించవచ్చు. 

ఇంకా విచిత్రమైన విషయమేమిటంటే ఆనాడు చంద్రబాబునాయుడు చేసిన తప్పునే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తున్నట్లున్నారు. అధికారం చేపట్టిన వెంటనే రాజధాని నిర్మాణ పనులు వేగవంతం చేసే బదులు, నిర్మాణపనులు పూర్తిగా నిలిపివేయించారు. ఒకవేళ ఇప్పటికైనా మేల్కొనకపోతే చూస్తుండగానే మిగిలిన నాలుగున్నరేళ్ళు కూడా పూర్తయిపోతాయి. అప్పుడు ఈరోజు చంద్రబాబునాయుడుకు ఎదురైన పరిస్థితులే భవిష్యత్‌లో జగన్మోహన్ రెడ్డికి ఎదురవవచ్చునని మరిచిపోకూడదు. కనుక వీలైనంత వేగంగా జగన్ ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తే మంచిది.


Related Post