ఆర్టీసీ జేఏసీ నేతలు రాజీనామాలకు సిద్దం?

November 28, 2019


img

సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఈరోజు మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఆర్టీసీలో గత 52 రోజులుగా జరిగిన పరిణామాలు, ఆర్టీసీ సమస్యల పరిష్కారం, ఆర్టీసీ ప్రైవేటీకరణ, ఆర్టీసీ కార్మికులను విధులలోకి తీసుకోవాలా వద్దా?అనే అంశాలపై లోతుగా చర్చించి తుది నిర్ణయం తీసుకోవడం కోసమే ప్రత్యేకంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. 

ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి బేషరతుగా విధులలో చేరేందుకు వచ్చినప్పటికీ ప్రభుత్వం నిరాకరిస్తుండటంతో ఆర్టీసీ జేఏసీ నేతలు కీలక నిర్ణయం తీసుకొన్నారు. తమ కారణంగానే ఆర్టీసీ కార్మికులు నష్టపోయారని సిఎం కేసీఆర్‌ ఆరోపిస్తున్నందున తామందరం ఉద్యోగాలకు రాజీనామాలు చేయడానికి సిద్దమని ఆర్టీసీ జేఏసీ కొ-కన్వీనర్ ధామస్ రెడ్డి ప్రకటించారు. 

“మేము ఉద్యోగాలలో నుంచి తప్పుకొంటే ఆర్టీసీ కార్మికులకు మేలు కలుగుతుందంటే తప్పుకోవడానికి సిద్దంగా ఉన్నాము. మాపై ద్వేషంతో ఆర్టీసీ కార్మికులకు అన్యాయం చేయవద్దని సిఎం కేసీఆర్‌ను కోరుతున్నాము. ఆర్టీసీ కార్మికులందరినీ బేషరతుగా విధులలోకి తీసుకొని ఆర్టీసీని పాత పద్దతిలోనే నడిపించాలని సిఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు జరుగబోయే మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీ కార్మికులను విధులలో తీసుకోవడంపై తుది నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాము,” అని అన్నారు.

ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గ సమావేశం మొదలవుతుంది. కనుక ఆలోపుగానే ఆర్టీసీ జేఏసీ నేతలు తమ రాజీనామాలపై అధికారికంగా ప్రకటన చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఆర్టీసీ ప్రైవేటీకరణ ప్రతిపాదనను విరమించుకొని, సమ్మెలో పాల్గొన్న 48,000 ఆర్టీసీ కార్మికులను విధులలో తీసుకొనేందుకు ప్రభుత్వం అంగీకరిస్తుందని వారు ఆశిస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల కోసం జేఏసీ నేతలు ఇంత త్యాగానికి సిద్దపడితే అది చాలా గొప్ప విషయమే. వారు ఈ మాటకు కట్టుబడి ఉన్నట్లయితే ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించవచ్చు.


Related Post