హైకోర్టును ఆశ్రయించడం తప్పు: హైకోర్టు

November 27, 2019


img

ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై దాఖలైన పిటిషన్‌పై మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఆర్టీసీ సమ్మెపై కార్మిక న్యాయస్థానానికి వెళ్లకుండా హైకోర్టును ఆశ్రయించడమే తప్పు అని తేల్చి చెప్పింది. ఈ సమస్యపై హైకోర్టును ఆశ్రయించడం కంటి సమస్య వస్తే కిడ్నీ డాక్టరు దగ్గరకు వెళ్ళినట్లుందని వ్యాఖ్యానించింది. రాజ్యాంగం ప్రకారం హైకోర్టుకు కొన్ని విషయాలలో పరిమితులు, అపరిమితమైన అధికారాలు ఉన్నాయని కనుక ఆర్టీసీ కేసులలో హైకోర్టు తన పరిధికి లోబడే నడుచుకోవలసి ఉంటుందని స్పష్టం చేసింది. కోర్టుకు చట్టం, సాక్ష్యాలు, ఆధారంగానే విచారణ జరుపుతాయి తప్ప భావోద్వేగాలను బట్టి కాదని మరోసారి తేల్చి చెప్పింది. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకొంటే దానిని హైకోర్టు ఆపలేదని, అందుకు ప్రభుత్వాన్ని బాధ్యుని చేయలేదని స్పష్టం చేసింది. సమ్మె చేయాలని నిర్ణయించింది ఆర్టీసీ కార్మిక సంఘాలే కనుక అందుకు ప్రభుత్వాన్ని తప్పు పట్టలేమని స్పష్టం చేసింది. పరిస్థితులను బట్టి ఆర్టీసీ కార్మిక సంఘాలు తగిన నిర్ణయం తీసుకోవడంలో విఫలమైనందునే ఈ దుస్థితి ఏర్పడిందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులు కార్మిక న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లయితే న్యాయం పొందవచ్చని హైకోర్టు తేల్చి చెప్పింది. ‘ఆర్టీసీ యాజమాన్యం కార్మికులను విధులలో చేర్చుకోవడం లేదు’ అనే ఫిర్యాదును జత చేసి మరో పిటిషన్‌ వేసినట్లయితే దానిపై విచారణ జరపడానికి అభ్యంతరం లేదని హైకోర్టు తెలిపింది. అయితే ఆర్టీసీ సమస్యలను కార్మిక న్యాయస్థానంలో తేల్చుకోవడమే మంచిదని సూచించింది. 

కోర్టులన్నీ రాజ్యాంగం దానిలో చట్టాలు, సాక్ష్యాధారాలతోనే విచారణ జరుపుతాయని అందరికీ తెలుసు. అయితే సుమారు 50 రోజులు ఆర్టీసీ సమస్యపై విచారణ జరిపిన తరువాత ‘హైకోర్టును ఆశ్రయించడం తప్పు కార్మిక న్యాయస్థానానికి వెళ్లాలని’ చెప్పడాన్నే అందరూ తప్పు పడుతున్నారు. ఇదే ముక్క మొదటే చెప్పి ఉండి ఉంటే ఆర్టీసీ కార్మిక సంఘాలు కార్మిక న్యాయస్థానాన్నే ఆశ్రయించి ఉండేవారు. ఈపాటికి ఏదో ఒక తీర్పు వచ్చి ఉండేది కదా?అని అందరూ ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ సమస్యపై ఇంకా హైకోర్టు చుట్టూ తిరగడం అనవసరమని హైకోర్టే స్వయంగా చెపుతోంది కనుక ఆర్టీసీ కార్మిక సంఘాలు కార్మిక న్యాయస్థానానికి వెళ్ళడమే మంచిది.


Related Post