ఈనెల 28న మంత్రివర్గ సమావేశం

November 26, 2019


img

సిఎం కేసీఆర్‌ మంగళవారం ప్రగతి భవన్‌లో ఆర్టీసీపై ఉన్నతాధికారులతో మరోసారి సమీక్షా సమావేశం నిర్వహించి ఆర్టీసీ ప్రైవేటీకరణ విధివిధానాలపై చర్చించారు. ఆర్టీసీ ప్రైవేటీకరణకు హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది కనుక ఈనెల 28న మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో మంత్రివర్గ సమావేశం నిర్వహించి ప్రయివేటీకరణ ప్రతిపాదనపై మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. అవసరమైతే శుక్రవారం కూడా మరోసారి మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ సమ్మె కేసు లేబర్ కోర్టుకు చేరింది కనుక తుది తీర్పు వచ్చే వరకు కార్మికులను విధులలో తీసుకోమని టీఎస్‌ఆర్టీసీ ఇన్-ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ నిన్ననే ప్రకటించారు. కనుక మంత్రివర్గ సమావేశంలో కేవలం ఆర్టీసీ ప్రైవేటీకరణపై మాత్రమే తుది నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.  

ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమణ చేసినప్పటికీ ఆర్టీసీ యాజమాన్యం వారిని విధులలో తీసుకొనేందుకు నిరాకరిస్తుండటంతో వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఇప్పుడు వారు సమ్మెలో పాల్గొనవలసిన అవసరం లేదు అలాగని ఇంట్లో కూర్చోలేరు. కుటుంబాన్ని పోషించుకొనేందుకు ఏదో ఒక పనికి వెళ్ళక తప్పదు. ఆర్టీసీ కార్మికులు ఉద్యోగాలపై ఆశలు వదిలేసుకొని పనులకు వెళ్ళడం మొదలుపెడితే ప్రభుత్వంపై ఇక ఎటువంటి ఒత్తిడి ఉండదు కనుక ఆర్టీసీకి సంబందించి యాధేచ్చగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇటువంటి దుస్థితి వస్తుందని బహుశః ఆర్టీసీ కార్మికులు కలలో కూడా ఊహించి ఉండరు. 

ఆర్టీసీ సమస్యల గురించి సిఎం కేసీఆర్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు నిన్న వివరించిన తరువాత ఇవాళ్ళ ఆర్టీసీ ప్రైవేటీకరణపై సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారంటే ఈ వ్యవహారంలో గవర్నర్‌ జోక్యం చేసుకోదలచుకోలేదని భావించవచ్చు. కేంద్ర రవాణామంత్రి నితిన్ గడ్కారీ సిఎం కేసీఆర్‌తో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరిస్తారని రాష్ట్ర బిజెపి ఎంపీలు చెప్పుకొన్నారు. కనుక ఆర్టీసీ కార్మికులకు చివరి ఆశాకిరణం కేంద్రప్రభుత్వం మాత్రమే.


Related Post