తెరాస సిద్దంగా ఉంటే మంచిదేమో?

November 25, 2019


img

ఇదివరకు కర్ణాటకలో జరిగిందే ఇప్పుడు మహారాష్ట్రలో జరుగుతోంది. ఆ తరువాత ఏ రాష్ట్రం వంతు? అనే ప్రశ్నకు ‘తెలంగాణ’ అని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ చెపుతున్నారు. మహారాష్ట్ర తరువాత ప్రజల మనోభావాలకు అనుగుణంగా తెరాస సర్కార్‌పై ‘సర్జికల్ స్ట్రైక్’ జరుపుతామని కె.లక్ష్మణ్‌ బహిరంగంగానే ప్రకటించారు. 

రాష్ట్రంలో బిజెపికి ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నందున అది సాధ్యమా కదా? అనే సంగతి పక్కనపెట్టి చూస్తే తెరాస సర్కార్‌పై సర్జికల్ స్ట్రైక్ కోసం బిజెపి మూడు నెలలుగా ఏర్పాట్లు చేసుకొంటూనే ఉంది. ముందుగా తెరాసను, మజ్లీస్ పార్టీలను, సిఎం కేసీఆర్‌ను తీవ్రంగా వ్యతిరేకించే సికింద్రాబాద్‌ ఎంపీ జి.కిషన్‌రెడ్డిని కేంద్రహోంశాఖ సహాయమంత్రిగా నియమించింది. ఆ తరువాత తమిళనాడు బిజెపి అధ్యక్షురాలుగా వ్యవహరించిన తమిళిసై సౌందరరాజన్‌ను తెలంగాణకు గవర్నర్‌గా నియమించింది. మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన సిహెచ్ విద్యాసాగర్ రావును మళ్ళీ తెలంగాణకు తిరిగి పంపించింది.

హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై తీవ్ర వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు కేంద్రప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్ జనరల్‌గా రాజేశ్వర్ రావును నియమించి, ఏపీఎస్‌ ఆర్టీసీ ఇంకా విభజనే జరుగలేదని కనుక టీఎస్‌ఆర్టీసీ ఏర్పాటు చెల్లదని తేల్చి చెప్పింది. ఆర్టీసీలో కేంద్రప్రభుత్వానికి 33 శాతం వాటా ఉన్నందున సమ్మె వ్యవహారంలో జోక్యం చేసుకొనే అధికారం ఉందని బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, ఎంపీ బండి సంజయ్ కుమార్‌ వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్టీసీ సమ్మె కారణంగా రాష్ట్రంలో తో తెరాస సర్కార్‌కు ఇబ్బందికరమైన వాతావరణం కూడా నెలకొని ఉంది.

తెరాసలో ‘గులాబీ జెండా ఓనర్ల’ సమస్యనే ఉండనే ఉంది. కనుక ఈ వరుస పరిణామాలన్నిటినీ కలిపి చూసినట్లయితే ఏదో ఓ రోజు బిజెపి తెరాసపై సర్జికల్ స్ట్రైక్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక దానిని ఎదుర్కోవడానికి తెరాస ఆయుధాలు సిద్దం చేసుకొని ఉంటే మంచిది. 


Related Post