కరీంనగర్‌ తెరాసలో ఏమి జరుగుతోందో?

November 25, 2019


img

కరీంనగర్‌ జిల్లా తెరాసలో మంత్రులు ఈటల రాజేందర్‌, గంగుల కమాలకర్ వర్గాల మద్య నానాటికీ దూరం పెరుగుతోంది. సాధారణంగా జెడ్పీ సమావేశంలో జిల్లాకు సంబందించి సమస్యలపై చర్చలు జరుగుతుంటాయి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యి సమస్యల పరిష్కారానికి తగిన సూచనలు, సలహాలు ఇస్తుంటారు. అవసరమైతే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తుంటారు. వాటికి అవసరమైన నిధులు మంజూరు చేయిస్తుంటారు. ఆదివారం కనమల విజయ అధ్యక్షతన జరిగిన కరీంనగర్‌ జెడ్పీ సమావేశం జరిగింది. దానికి మంత్రి గంగుల కమాలకార్ హాజరైనప్పుడు, కరీంనగర్‌లోనే ఉన్న ఈటల రాజేందర్‌కు శుభకార్యాలకు వెళ్ళారు. అవి చూసుకొని ఆయన మధ్యాహ్నం ఒంటి గంటకు జెడ్పీ సమావేశానికి రాగా ఖమ్మంలో శుభకార్యాలకు హాజరయ్యేందుకు గంగుల వెళ్ళిపోయారు. అప్పటి వరకు సమావేశంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు కూడా గంగులతో పాటు బయటకు వెళ్ళిపోయారు. అయితే వారిరువురూ పెళ్ళిళ్ళకు హాజరు కావలసి ఉన్నందునే ఒకేసారి సమావేశంలో పాల్గొనలేకపోయారా? లేక వారి మద్య విభేధాలు ముదిరినందునే ఈవిధంగా దూరదూరంగా ఉంటున్నారా? అనే ప్రశ్నకు వారే సమాధానం చెప్పాలి.   

ఇక జెడ్పీ సమావేశాలకు జిల్లా పరిపాలనాధికారి అయిన కలెక్టర్ తప్పనిసరిగా హాజరవుతుంటారు. కానీ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ హాజరుకాలేదు. అసెంబ్లీ ఎన్నికలలో ఆయన బిజెపి ఎంపీ బండి సంజయ్ కుమార్‌తో మాట్లాడిన ఫోన్‌ సంభాషణ లీక్ అవడంతో ఆయనపై గంగుల సిఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వారిరువురి మద్య దూరం మరింత పెరిగింది. బహుశః అందుకే కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ జెడ్పీ సమావేశానికి హాజరుకాకపోయుండవచ్చు. ఆయన తరపున జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్‌ను సమావేశానికి పంపించారు. 

జిల్లాకు చెందిన మంత్రులు ఈటల రాజేందర్‌, గంగుల కమలాకర్, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మద్య సఖ్యత, సయోద్య లేకపోతే అది జిల్లా అభివృద్ధికి అవరోధంగా మారుతుందని వేరే చెప్పక్కరలేదు.   



Related Post