ఆర్టీసీ సమ్మె 52వ రోజు...పరిష్కారం ఎప్పుడో?

November 25, 2019


img

టీఎస్‌ఆర్టీసీ సమ్మె నేటితో 52వ రోజుకు చేరింది. కానీ ప్రభుత్వం స్పందించకపోవడంతో ముందుగా చెప్పినట్లుగానే సమ్మె నిరవదికంగా సాగుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆర్టీసీ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారుతుండటంతో చాలా మంది ఆర్టీసీ కార్మికులు రోజూ కూలీలుగా పనులకు వెళుతున్నారు. ఇక ఎంతమాత్రం సమ్మెను కొనసాగించే ఓపిక లేనప్పటికీ ఆర్టీసీ కార్మికులు డిపోల ముందు ధర్నాలు చేస్తున్నారు. మొదట తమ డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేసిన ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు తమను విధులలో తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు చేస్తున్నారంటే వారి దయనీయ పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. యూనియన్ నాయకులు కూడా మీడియా చర్చలలో తమ ఓటమిని ఒప్పుకొని ఇకనైనా సిఎం కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికులను విధులలోకి తీసుకొని ఆదుకోవాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆర్టీసీ కార్మికులు తీవ్ర నిరాశానిస్పృహలకు లోనవుతూ సిఎం కేసీఆర్‌ నిర్ణయం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు.

ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు వెలువరించింది కనుక బహుశః సిఎం కేసీఆర్‌ ఈరోజు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఆర్టీసీ ప్రైవేటీకరణ, న్యాయపరమైన సమస్యలు, ఆర్టీసీ కార్మికులను విధులలోకి తీసుకోవడంపై చర్చించి నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. ఒకవేళ సిఎం కేసీఆర్‌ తన వైఖరికే కట్టుబడి ఉండదలిస్తే ఆర్టీసీ కార్మికులు  పూర్తిగా రోడ్డున పడినట్లే. కనుక సిఎం కేసీఆర్‌ ఎటువంటి నిర్ణయం తీసుకోంటారో చూడాలి. 


Related Post