రాష్ట్రంలో సమ్మె చేసే సాహసం ఎవరైనా చేయగలరా?

November 23, 2019


img

టీఎస్‌ఆర్టీసీ సమ్మె అటు కార్మిక, ఉద్యోగ సంఘాలకు వారికి మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చే ప్రతిపక్షాలకు అనేక గుణపాఠాలు నేర్పాయని చెప్పవచ్చు. ఆర్టీసీ సమ్మెపై సిఎం కేసీఆర్‌ ఎన్ని విమర్శలు, సమస్యలు ఎదురయినా ఏమాత్రం చలించకుండా మొదటి నుంచి చివరి వరకు అదే వైఖరికి కట్టుబడి, పార్టీ నేతలను మంత్రులు, ఎమ్మెల్యేలను గీత దాటనీయకుండా ఉంచుకొని చివరకు అనుకొన్నది సాధించారు.

ఆర్టీసీ సమ్మె విషయంలో ఆర్టీసీ కార్మిక సంఘాలు ఏమీ చేయలేకపోయాయి. కాంగ్రెస్‌, బిజెపిలతో సహా వారికి మద్దతు ఇచ్చిన ప్రతిపక్షాలు కేసీఆర్‌ మొండివైఖరిని విమర్శించడం తప్ప మరేమీ చేయలేకపోయాయి. చివరికి హైకోర్టు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేసి విమర్శలపాలైంది.

దాంతో ఆర్టీసీ జేఏసీకి వేరే గత్యంతంరం లేక బేషరతుగా సమ్మె విరమణకు సిద్దమయింది. అయినా ప్రభుత్వం స్పందించలేదు కానీ ఆర్టీసీ కార్మిక సంఘాలలో విభేదాలు మొదలయ్యాయి. దాంతో ఆర్టీసీ కార్మిక సంఘాలకు తరువాత ఏమి చేయాలో పాలుపోని అయోమయస్థితిలో ఉన్నారు. నమ్ముకొన్న ఆర్టీసీ జేఏసీ నేతలు ఏమీ చేయలేకపోవడంతో 50 రోజుల సమ్మెతో ఆర్ధిక సమస్యలతో విలవిలలాడుతున్న ఆర్టీసీ కార్మికులు బేషరతుగా డ్యూటీలో చేరేందుకు డిపోల వద్ద క్యూ కడుతున్నారు. తమను డ్యూటీలోకి తీసుకోవాలని కనీసం తాత్కాలిక ఉద్యోగాలలోనైనా తీసుకోవాలంటూ డిపో మేనేజర్లను వేడుకొంటున్నారు.

సమ్మెకు ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వగలవు కానీ అవేమీ చేయలేవనే సంగతి ఆర్టీసీ సమ్మెతో నిరూపితమైంది కనుక భవిష్యత్‌లో అవి మద్దతుకు సిద్దమైనా ఉద్యోగ, కార్మిక సంఘాలు వాటి దన్నుతో సమ్మె చేయడానికి సాహసించకపోవచ్చు. ఆర్టీసీ కార్మిక సంఘాలతో కలిసి పోరాడినా కాంగ్రెస్‌, బిజెపిలు వారి సమస్యలను పరిష్కరించలేకపోయాయి కనుక వాటికీ రాజకీయంగా ఎంతో కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. కనుక ఆర్టీసీ సమ్మె రాష్ట్రంలో భవిష్యత్‌ పరిణామాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేసిందని భావించవచ్చు.

ఇవన్నీ చూసిన తరువాత బహుశః రాష్ట్రంలో మరే ఉద్యోగ, కార్మిక సంఘం కూడా కలలో కూడా సమ్మె చేయాలనే ఆలోచన చేయకపోవచ్చు. చేస్తే తమకూ ఇదే గతి పడుతుందనే భయం ఏర్పడటం సహజం. ఒకవేళ యూనియన్ నేతలు సమ్మెకు పిలుపునిచ్చినా ఉద్యోగులు, కార్మికులు వారి మాటను మన్నించకపోవచ్చు. డిమాండ్లు సాధించుకోలేని పరిస్థితి ఏర్పడితే బహుశః భవిష్యత్‌లో రాష్ట్రంలో యూనియన్లు నిర్వీర్యమైనా ఆశ్చర్యం లేదు.  

ఈ పరిణామాలు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాక ఇరుగు పొరుగు అన్ని రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. సమ్మె జరిగితే ఏవిధంగా వ్యవహరించాలో సిఎం కేసీఆర్‌ను చూసి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేర్చుకోవచ్చు. అలాగే తెలంగాణతో సహా ఇరుగుపొరుగు రాష్ట్రాలలో ఉద్యోగ కార్మిక యూనియన్లు సమ్మె చేస్తే ఏమవుతుందో ఆర్టీసీ కార్మికులను చూసి నేర్చుకోక తప్పదు. ఈ పరిణామాల నేపధ్యంలో ఇక ఉద్యోగ, కార్మిక సంఘాలకు అన్ని దారులు మూసుకుపోయినట్లే భావించవచ్చు. భవిష్యత్‌లో జీతాల పెంపుకు కోసం అవి ప్రభుత్వానికి ఓ వినతిపత్రం ఇచ్చి అది పెంచితే తీసుకోవడం లేకుంటే బుద్దిగా పనిచేసుకోక తప్పదు.

ఈ సుదీర్గ పోరాటంలో ఆర్టీసీ కార్మికులు ఘోరంగా ఓడిపోగా సిఎం కేసీఆర్‌ ఘనవిజయం సాదించారని చెప్పక తప్పదు. అయితే కన్నబిడ్డల వంటి ఆర్టీసీ కార్మికుల ఓటమి, వారిపై కుటుంబ పెద్ద కేసీఆర్‌ విజయం అభినందనీయమేనా? అనే ప్రశ్నకు సమాధానం అందరికీ తెలుసు. 


Related Post