ఆర్టీసీ ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

November 22, 2019


img

ఆర్టీసీ ప్రైవేటీకరణను సవాలు చేస్తూ టిజేఎస్‌ ఉపాధ్యక్షుడు పిఎల్. విశ్వేశ్వరరావు వేసిన పిటిషన్‌పై ఈరోజు విచారణ జరిపిన హైకోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత ఆర్టీసీని ప్రైవేటీకరించడం తప్పు కాదని, రాష్ట్ర ప్రభుత్వానికి ఆ హక్కు ఉందని కనుక 5,100 రూట్లను ప్రైవేటీకరించదాన్ని తప్పు పట్టలేమని స్పష్టం చేసింది. కనుక ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. అంటే మొదటి నుంచి సిఎం కేసీఆర్‌ తీసుకొన్న నిర్ణయాలే సరైనవని హైకోర్టు తాజా తీర్పుతో తేల్చి చెప్పినట్లయింది. దీంతో ఆర్టీసీ కార్మికుల 48 రోజుల పోరాటం బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది. 

ఆర్టీసీ ప్రైవేటీకరణకు హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది కనుక ఇక ప్రభుత్వం చురుకుగా ఏర్పాట్లు చేసుకోవచ్చు. గడువులోగా ఆర్టీసీలో 1,700 మంది మాత్రమే చేరారు కనుక వారిని మాత్రమే ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణిస్తామని మిగిలిన వారితో సంబందం లేదని కేసీఆర్‌ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే మిగిలిన 5,000 రూట్లలో ఆర్టీసీ సొంత బస్సులను నడపడానికి సుమారు 23-25,000 మంది కార్మికులు అవసరం ఉంటుంది. కనుక సమ్మె చేస్తున్న 48,000 మందిలో అంత మందిని మాత్రమే తీసుకోగలుగుతుంది. కనుక ఒకవేళ ప్రభుత్వం కనికరిస్తే మిగిలినవారికి స్వచ్ఛంద పదవీ విరమణ అవకాశం కల్పించవచ్చు లేదా వారు తమ ఉద్యోగాల కోసం కోర్టుల చుట్టూ తిరుగక తప్పదు. ఉద్యోగాలలో చేర్చుకొదలచిన వారికి కూడా ప్రభుత్వం విధించే ఆంక్షలకు కట్టుబడి పనిచేయడానికి సిద్దపడవలసిరావచ్చు. ఆర్టీసీపై హైకోర్టు తుది తీర్పు చెప్పింది కనుక నేడో రేపో సిఎం కేసీఆర్‌ కూడా ప్రభుత్వ నిర్ణయం ప్రకటించవచ్చు.


Related Post