పాపం ఆర్టీసీ కార్మికులు!

November 22, 2019


img

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో గత 48 రోజులుగా సమ్మె చేసిన ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు తమను మళ్ళీ విధులలో తీసుకోవాలని డిపో మేనేజర్లను వేడుకొంటున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రానందున వారిని విధులలోకి చేర్చుకోలేమని డిపో మేనేజర్లు వారికి నచ్చజెప్పి వెనక్కు తిప్పి పంపిస్తున్నారు.

గురువారం రాష్ట్రవ్యాప్తంగా అనేక డిపోల వద్దకు వందలాది ఆర్టీసీ కార్మికులు చేరుకొని తమను విధులలో చేర్చుకోవాలని డిపో మేనేజర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. కొందరు వినతిపత్రాలు అందజేస్తున్నారు. కానీ డిపో మేనేజర్లు వారికి పరిస్థితి వివరించి వెనక్కుతిప్పి పంపుతుండటంతో కొంతమంది డిపో గేట్ల వద్ద ఆశగా పడిగాపులు కాస్తుంటే, మరికొన్ని చోట్ల తమను విధులలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు చేస్తున్నారు.


ఆర్టీసీ కార్మికుల దయనీయ పరిస్థితులు చూసి జాలిపడి ఉపాద్యాయ సంఘాలు, రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు విరాళాలు సేకరించి వారికి ధన, వస్తురూపంలో సహాయం అందజేస్తున్నాయి. మిర్యాలగూడ బస్‌ డిపోలో భిక్షాటన చేసి జీవిస్తున్న సైదమ్మ అనే యాచకురాలు ఆర్టీసీ కార్మికుల పరిస్థితి చూసి తను సంపాదించిన రూ.4,000లను వారికి అందజేసింది. అనేక ఏళ్లుగా అక్కడ అడ్డుకొంటున్న తనకు ఆర్టీసీ కార్మికులు ఎంతో సాయం చేసేవారని, ఇప్పుడు ఉడతాభక్తిగా వారికి తిరిగి సాయం చేస్తున్నానని ఆమె అన్నారు. తెలంగాణ సాధన కోసం పోరాడిన ఆర్టీసీ కార్మికులకు ఇటువంటి దుస్థితి ఎదురవడం చాలా బాధాకరమే. 


Related Post