ఆర్టీసీ కార్మికుల పరిస్థితి అయోమయం

November 22, 2019


img

ఆర్టీసీ కార్మికులు బేషరతుగా సమ్మె విరమించి విధులలో చేరేందుకు సిద్దమని ప్రకటించిన తరువాత సిఎం కేసీఆర్‌ గురువారం అధికారులతో సమీక్షా సమావేశం జరుపడంతో ఆర్టీసీ కార్మికులను తిరిగి విధులలో చేర్చుకొనే విషయంపై చర్చిస్తారని అందరూ ఆశగా ఎదురుచూశారు. కానీ ఆర్టీసీ ప్రైవేటీకరణపై ఈరోజు హైకోర్టులో జరుగబోయే విచారణలో ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం తరపున ఏవిదంగా వాదించాలి...తమ వాదనలను బలపరుచుకొనేందుకు కోర్టుకు సమర్పించవలసిన గణాంకాల గురించి లోతుగా సమావేశంలో చర్చించారు. ఆర్టీసీపై హైకోర్టు తుది తీర్పు వెలువరిచిన తరువాతే ఆర్టీసీ కార్మికులను విధులలో తీసుకోవాలా వద్దా? అనే అంశంపై చర్చించాలని సిఎం కేసీఆర్‌ నిర్ణయించారు. 

ఆర్టీసీకి సుమారు రూ.5,000 కోట్లకు పైగా అప్పులున్నాయని, తక్షణం చెల్లించవలసిన అప్పులే రూ. 2,000 కోట్లు వరకు ఉన్నాయని, ఆర్టీసీని నడిపించాలంటే నెలకు రూ.640 కోట్లు అవసరమని, సెప్టెంబర్ జీతాలు చెల్లించడానికే రూ.240 కోట్లు అవసరమని ఈ పరిస్థితులలో ప్రభుత్వం ఇక ఎంతమాత్రం ఆర్టీసీని నడిపించలేదని హైకోర్టులో వాదించబోతోంది. ఆర్టీసీ సమస్యకు శాస్విత పరిష్కారం కనుగొనడానికే ప్రభుత్వం ఆలోచిస్తోందని కోర్టుకు తెలియజేయబోతోంది.ఆర్టీసీ ప్రైవేటీకరించడమే ఈ సమస్యకు శాస్విత పరిష్కారమని ప్రభుత్వం మొదటి నుంచి వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు హైకోర్టులో అదే మరోసారి నొక్కి చెప్పబోతోంది.    

ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించలేమని చేతులెత్తేసిన హైకోర్టు ఆర్టీసీ ప్రైవేటీకరణకు కూడా అభ్యంతరం లేదన్నట్లే మాట్లాడింది. కానీ 5,100 రూట్లలో ప్రైవేట్ బస్సులు ప్రవేశపెట్టడంపై స్టే కొనసాగిస్తోంది. ఒకవేళ  హైకోర్టు స్టే కొనసాగిస్తే తుది తీర్పు వెలువడేవరకు ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను విధులలోకి తీసుకోదు. ఒకవేళ స్టే ఎత్తివేస్తే ఆర్టీసీలోకి ఒకేసారి 5,100 రూట్లలో ప్రైవేట్ బస్సులు ప్రవేశిస్తాయి కనుక ఆమేరకు ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కనుక హైకోర్టు స్టే కొనసాగించినా, స్టే ఎత్తివేసినా కూడా నష్టపోయేది ఆర్టీసీ కార్మికులే.

ఆర్టీసీ సమ్మె విరమిస్తున్నట్లు ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి ప్రకటించినప్పటికీ ఆర్టీసీ కార్మికులను తిరిగి ఉద్యోగాలలోకి తీసుకోవడానికి తొందరపడకూడదని ప్రభుత్వం నిర్ణయించడంతో కార్మికుల పరిస్థితి అయోమయంగా మారింది. 

సమ్మె విరమణ చేయడానికి సిద్దమని అశ్వధామరెడ్డి సమ్మె ప్రకటన చేయగానే గురువారం అనేకమంది ఆర్టీసీ కార్మికులు డిపో మేనేజర్ల వద్దకు వెళ్ళి తమను ఉద్యోగాలలోకి తీసుకోవాలని వేడుకొన్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రానందున విధులలోకి తీసుకోలేమని డిపో మేనేజర్లు చెప్పడంతో ఆర్టీసీ కార్మికులు తీవ్ర నిరాశనిస్పృహలతో వెనుతిరిగారు. టీఎస్‌ఆర్టీసీ కార్మికుల జీవితాలలో ఇంత దయనీయమైన, ఇంత ఆందోళనకరమైన రోజులను ఎన్నడూ చూసి ఉండరు. వారిని ఇక కేంద్రప్రభుత్వమే కాపాడాలి.


Related Post