కరీంనగర్‌ తహశీల్దార్‌ కార్యాలయంలో పెట్రో దాడి!

November 19, 2019


img

అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్‌ విజయారెడ్డి సజీవదహనం తరువాత రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఆ తరువాత కొన్ని చోట్ల రెవెన్యూ ఉద్యోగులకు బెదిరింపులు రావడంతో వారు భయం భయంగా పనిచేస్తున్నారు. 

తాజాగా కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి ఎమ్మార్వో కార్యాలయంలోకి దూసుకువచ్చిన ఒక రైతు వెంటతెచ్చుకొన్న పెట్రోల్‌ను అక్కడి కంప్యూటర్లపై జల్లి నిప్పు పెట్టబోయాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అతనిని అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. 

జిల్లాలో లంబాడిపల్లికి చెందిన కనకయ్య రైతు గత కొంతకాలంగా తన పాసు పుస్తకం కోసం ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. కానీ పాసు పుస్తకం ఇవ్వకుండా అధికారులు తిప్పించుకొంటుండటంతో సహనం కోల్పోయిన కనకయ్య మంగళవారం పెట్రోల్ డబ్బాతో ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చి పాసు పుస్తకం గురించి మళ్ళీ మరోసారి గట్టిగా అధికారులను నిలదీశాడు. వారు తరువాత రమ్మనమని చెప్పడంతో తీవ్ర ఆవేశానికి లోనైనా కనకయ్య వెంట తెచ్చుకొన్న పెట్రోలును అక్కడి కంప్యూటర్లపై చల్లి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించాడు. కార్యాలయ సిబ్బంది వెంటనే అతనిని అడ్డుకొన్నారు లేకుంటే తృటిలో ఎమ్మార్వో కార్యాలయం మంటలలో దగ్ధమయిపోయుండేది. పోలీసులు కనకయ్యపై కేసు నమోదు చేసి  అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

ఈ ఘటనలో కనకయ్య చేసిన నేరం ప్రధానంగా కనబడుతోంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా సామాన్య రైతులు తమ భూమిపై యాజమాన్యపు హక్కును దృవీకరించే పాసు పుస్తకాల కోసం ఎన్ని తిప్పలు పడుతున్నారో...వారు ఎంతగా ఆవేదన చెందుతున్నారో ఈ ఘటన తెలియజేస్తోంది. 

దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కేవలం 100 రోజులలోనే సమగ్ర భూసర్వే నిర్వహించామని, భూరికార్డులన్నీ ప్రక్షాళన చేశామని, అత్యంత పారదర్శకమైన, సరళమైన రెవెన్యూ విధానాలను అమలుచేస్తున్నామని, కనుక ఇకపై రైతులు రెవెన్యూ కార్యాలయాలు...అధికారుల చుట్టూ తిరగవలసిన అవసరం లేదని, వారి ఇళ్లకే పాసు పుస్తకాలు వచ్చేస్తాయంటూ సిఎం కేసీఆర్‌ మొదలు మంత్రులు, నేతలు చాలా గొప్పలు చెప్పుకొన్న సంగతి అందరికీ తెలుసు. 

మరి ప్రభుత్వం అంత గొప్పగా ఏర్పాట్లు చేస్తే నేటికీ రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగేలా ఎందుకు తిరగవలసివస్తోంది? అప్పో సొప్పే చేసి వ్యవసాయం చేసుకొని బ్రతికే రైతులు ఈవిధంగా తీవ్ర ఆగ్రహావేశాలతో పెట్రోలు డబ్బాలతో రెవెన్యూ కార్యాలయాలపై ఎందుకు దాడులు చేస్తున్నారు? రెవెన్యూ కార్యాలయాల ముందే ఆత్మహత్యలు చేసుకొనేందుకు ఎందుకు సిద్దపడుతున్నారు? తప్పు రైతులదా...ప్రభుత్వానిదా...లేక రెవెన్యూ ఉద్యోగులదా?


Related Post