బండి సంజయ్-కలెక్టర్ సర్ఫరాజ్ సంభాషణలో కొత్త ట్విస్ట్

November 19, 2019


img

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కరీంనగర్‌ నుంచి బిజెపి అభ్యర్ధిగా పోటీ చేసిన బండి సంజయ్ కుమార్‌ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మద్య ఆనాడు జరిగిన ఒక ఫోన్‌ సంబాషణకు సంబందించి ఆడియో ఫుటేజీ ఇటీవల మీడియాకు లీక్ అవడంతో దానిని కరీంనగర్‌ తెరాస ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సిఎం కేసీఆర్‌కు సమర్పించి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌పై ఫిర్యాదు చేశారు. అదే ఒక సంచలన వార్త అనుకొంటే, బండి సంజయ్ కుమార్‌ చేసిన తాజా వ్యాఖ్యలు అంతకంటే సంచలనం సృష్టించేవిగా ఉన్నాయి.   

ఈ ఘటనలపై బండి సంజయ్ కుమార్‌ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, “అసెంబ్లీ ఎన్నికలలో జరుగుతున్న అవకతవకల గురించి నేను ఆనాడు జిల్లా కలెక్టరు సర్ఫరాజ్ అహ్మద్‌కు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేసిన మాట వాస్తవం. అప్పుడు ఆయన నాకు ఎన్నికల నియమనిబందనల గురించి వివరించిన మాట కూడా వాస్తవం. కానీ ఇదేదో పెద్ద నేరం అన్నట్లు తెరాస సర్కార్ భూతద్దంలో చూపించి ఒక నిజాయితీపరుడైన ఐఏస్‌ అధికారిపై బురద జల్లడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఆ రోజు నేను-సర్ఫరాజ్ అహ్మద్‌ ఫోన్లో మాట్లాడుకొన్న విషయాలు బయటకు ఎలా పొక్కాయి? దీనిని బట్టి అర్ధం అవుతున్నదేమిటంటే తెరాస సర్కార్‌ నాతో సహా ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేస్తోందనే అనుమానం కలుగుతోంది. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష అభ్యర్ధుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నట్లు ఇతర పార్టీలు కూడా అనుమానాలు వ్యక్తం చేశాయి. అవి నిజమని భావించవలసి వస్తోంది,” అని అన్నారు. బండి సంజయ్ చేసిన ఈ ఆరోపణలు చాలా తీవ్రమైనవి. ఈ మొత్తం, వ్యవహారాన్ని కొత్త మలుపు తిప్పే అవకాశాలు కనిపిస్తోంది. 

ఆర్టీసీ డ్రైవర్ నగునూరు బాబు అంతిమయాత్రలో ఒక పోలీస్ అధికారి ఎంపీ బండి సంజయ్ కుమార్‌ పట్ల అనుచితంగా వ్యవహరించినందుకు ఆయన లోక్‌సభ స్పీకరు ఓం బిర్లాకు ఫిర్యాదు చేయగా, ఆయన తదుపరి చర్యలకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెరాస సర్కార్‌ తన ఫోన్లను ట్యాపింగ్ చేస్తోందని బండి సంజయ్ మళ్ళీ లోక్‌సభ స్పీకరుకు ఫిర్యాదు చేసినట్లయితే ఈ వ్యవహారం తెరాస సర్కార్‌ మెడకు చుట్టుకొని మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. 


Related Post