ఆర్టీసీ కార్మికులకు హైకోర్టు అన్యాయం చేసింది: బిజెపి

November 19, 2019


img



రాష్ట్ర బిజెపి సీనియర్ నేత రఘునందన్ రావు ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు తీరును తప్పు పట్టారు. ఈ అంశంపై మంగళవారం ఒక ప్రముఖ న్యూస్ ఛానల్‌లో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ, “ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు విచారణ జరుపుతున్నప్పుడు అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆర్టీసీ యాజమాన్య వైఖరిని, అవి సమర్పించిన లెక్కలను తప్పు పట్టింది. చివరికి ఐఏస్‌ అధికారులను కోర్టుకు పిలిపించి అంక్షితలు వేసింది. సమ్మె చట్ట విరుద్దమని ప్రకటించలేమని నిన్న కూడా స్పష్టం చేసింది. ఈ కేసులో మొదటి నుంచి హైకోర్టు తీరును చూస్తున్న ఆర్టీసీ కార్మికులు, హైకోర్టు తమకు అండగా నిలబడిందని తప్పకుండా న్యాయం చేస్తుందని ఆశపడ్డారు. కానీ ‘ఆపరేషన్ సక్సస్ బట్‌ పేషెంట్ డెడ్‌’ అన్నట్లు తీర్పు చెప్పితనపై ఆశపెట్టుకొన్న ఆర్టీసీ కార్మికులను తీవ్ర నిరాశ పరిచింది. కనీసం కొండను త్రవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయింది. 

చర్చలు జరుపమని, ఆర్టీసీ కార్మికులను విధులలోకి తీసుకోమని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని హైకోర్టు చెప్పింది. మరి అటువంటప్పుడు ఇన్ని రోజులు ఈ కేసును ఎందుకు సాగదీసినట్లు? అదే...ఈ కేసును మొదట్లోనే వరుసగా మూడు నాలుగు రోజులు విచారణ చేపట్టి ఇదే విషయం అప్పుడే చెప్పి ఉండి ఉంటే ఇన్ని రోజులు సమ్మె కొనసాగేది కాదు కదా? అత్యవసరమైనప్పుడు అర్ధరాత్రి పూట కూడా సుప్రీంకోర్టు తలుపులు తెరిచి విచారణ జరుపుతున్నడు, హైకోర్టు కూడా ఈ కేసును యుద్ధప్రాతిదికన విచారించి ఉంటే ఇవాళ్ళ 48,000 ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడి ఉండేవి కావు కదా?నేను హైకోర్టు తీర్పును తప్పుపట్టడం లేదు దాని వైఖరిని మాత్రమే ప్రశ్నిస్తున్నాను. హైకోర్టు ఆర్టీసీ కార్మికులకు అన్యాయం చేసిందనే భావన ప్రజలలో కనిపిస్తోంది. అదే నేను చెపుతున్నాను. 

ఆర్టీసీ కేసును కార్మికశాఖకు బదిలీ చేయడం వలన ఇంకా ఆలస్యమే అవుతుంది తప్ప ఒరిగేదేమీ ఉండబోదని భావిస్తున్నాను. లేబర్ కోర్టు కూడా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాలలో నుంచి తొలగించలేదు. సమ్మె చట్ట విరుద్దమని కోర్టు భావిస్తే ఆర్టీసీ కార్మికులకు జరిమానాలు, జైలు శిక్ష విధించి మళ్ళీ విధులలో చేరమని ఆదేశించే అవకాశం ఉంది. హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళాలనుకొన్నట్లే లేబర్ కోర్టులో ఆర్టీసీ కార్మికులకు తీర్పు వ్యతిరేకంగా వస్తే వారు మళ్ళీ హైకోర్టు లేదా సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. అయితే కోర్టులకు వెళితే ఈ కేసు ఎప్పటికీ తేలుతుంది?అంతవరకు ఆర్టీసీ కార్మికులు జీతాలు లేకుండా ఎలా బ్రతుకుతారు?

ప్రభుత్వం కోరుకొన్నట్లుగానే హైకోర్టులో జరిగింది కనుక సిఎం కేసీఆర్‌ అహం ఇప్పుడు చల్లబడి ఉండవచ్చు. ఆర్టీసీ కార్మికులతో చేసిన యుద్ధంలో చివరికి నేనే గెలిచానని సిఎం కేసీఆర్‌కు తృప్తి కలిగి ఉంటుంది. కనుక ఇకనైనా ఆర్టీసీ కార్మికులందరినీ మళ్ళీ ఉద్యోగాలలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కాదని ఇంకా మొండికేస్తే సమస్య మరింత జటిలమవుతుంది. 

సమ్మెను ఇంకా కొనసాగించితే ఆర్టీసీ కార్మికులే తీవ్రంగా నష్టపోతారు కనుక ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా వెనక్కు తగ్గి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడం మంచిదని నా అభిప్రాయం,” అని రఘునందన్ రావు అన్నారు. 


Related Post