ఆర్టీసీ సమస్యపై చేతులెత్తేసిన హైకోర్టు

November 18, 2019


img

ఆర్టీసీ సమస్యపై సుదీర్గ విచారణ జరిపిన హైకోర్టు చేతులెత్తేసింది. సమ్మె చట్ట విరుద్దమని ప్రకటించలేమని, అలాగే చర్చలు ప్రారంభించమని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని తేల్చి చెప్పింది. 

ఆర్టీసీ కార్మిక సంఘాల తరపున వాదించిన జయప్రకాష్ రెడ్డి ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి విధులలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని కనుక వారితో తక్షణమే చర్చలు ప్రారంభించవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరగా, ఆ అధికారం తమకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది.  

ప్రభుత్వం తరపున వాదించిన అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ వైఖరిని మరోసారి పురుద్ఘాటించారు. ఆర్టీసీ కార్మికులు విధులలో చేరేందుకు ఇప్పుడు సిద్దపడినా వారిని భరించే శక్తి ఆర్టీసీకి లేదని తేల్చి చెప్పారు. ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్దమని ప్రకటించమని కోరగా హైకోర్టు నిరాకరించింది. 

ఈ సమస్యను రెండు వారాలలో పరిష్కరించాలని కార్మికశాఖ కమీషనర్‌ను ఆదేశించింది. దీనిపై లేబర్ కోర్టుకు వెళ్ళాలో వద్దో కార్మికశాఖే నిర్ణయించుకోవాలని సూచించింది.  

ఆర్టీసీ కార్మికులపట్ల ప్రభుత్వం చాలా కటినవైఖరితో వ్యవహరిస్తున్నందునే హైకోర్టు తన పరిధిలో ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ సమస్యను పరిష్కరించలేకపోయిందని చెప్పవచ్చు. కనుక ఈ విషయంలో హైకోర్టును తప్పు పట్టడానికి లేదు. ఈ సమస్య ఇప్పుడు కార్మికశాఖ చేతిలోకి వెళ్లింది కనుక కధ మళ్ళీ మొదటికి వచ్చినట్లే భావించవచ్చు. హైకోర్టు దాదాపు రెండు నెలలుగా విచారణ జరిపి పరిష్కరించలేకపోయిన ఈ సమస్యను కార్మికశాఖ రెండు వారాలలో పరిష్కరించగలదనుకోలేము. కనుక ఈ సమస్య ఇంకా ఎప్పటికీ పరిష్కారం అవుతుందో లేక అసలు కోర్టు కేసులతోనే కాలం గడిచిపోతుందో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. 

ఇప్పటికే రెండు నెలలుగా జీతాలు లేక అష్టకష్టాలు పడుతూ 45 రోజులుగా సమ్మె చేస్తూ అలసిపోయిన ఆర్టీసీ కార్మికులను, వారి కుటుంబాలను ఎవరు ఆదుకొంటారో తెలియదు కానీ తక్షణమే ఎవరో ఒకరు వారికి ఆపన్నహస్తం అందివ్వకపోతే వారి జీవితాలు అస్తవ్యస్తం అవడం ఖాయం.


Related Post