బండి సంజయ్-కలెక్టర్ సర్పరాజ్ ఆడియో టేపు కలకలం

November 18, 2019


img

గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిజెపి అబ్యర్ధిగా పోటీ చేసిన బండి సంజయ్ కుమార్, తెరాస అభ్యర్ధి గంగుల కమలాకర్ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన జిల్లా కలెక్టర్ సర్పారాజ్‌కు, బండి సంజయ్ కుమార్‌కు  మద్య మొబైల్ ఫోన్లో జరిగిన ఓ సంబాషణ బయట పడటంతో వైరల్ అయ్యింది. 

ఆ ఎన్నికలలో స్థానిక ‘శ్వేతా ఛానల్’లో వచ్చిన ఒకవార్తపై బండి సంజయ్ కుమార్‌ కలెక్టర్ సర్పారాజ్‌కు ఫిర్యాదు చేశారు. దానికి సంబందించి వారిరువురి మద్య సాగిన సంభాషణలో...గతంలో వేరే రాష్ట్రంలో అటువంటి పెయిడ్ న్యూస్‌కు సంబందించిన ఒక కేసులో హైకోర్టు సదరు ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేసినట్లు బండి సంజయ్‌కు వివరించి, తెరాస అభ్యర్ధి గంగుల కమలాకర్ ఎన్నికల ఖర్చు గురించి ‘ఫాలో అప్‌’ చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. 

అలాగే...ఎన్నికల విధులలో ఉన్న ఉద్యోగులలో కొందరు తెరాసకు అనుకూలంగా వ్యవహరిస్తుండటంపై బండి సంజయ్ కుమార్‌ చేసిన ఫిర్యాదుపై సర్పారాజ్ స్పందిస్తూ, ‘ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి ఉన్నమాట నిజం కానీ నిష్పక్షపాతంగా పనిచేయకపోతే ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని తీవ్ర హెచ్చరికలు చేసి అందరి చేత సక్రమంగా పనిచేయించానని’ చెప్పగా, బండి సంజయ్ ‘అది నిజమని ...కలెక్టర్ అంత గట్టిగా నిలబడి ఉండకపోయుంటే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగి ఉండేవి కావని....అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపినట్లు’ వారి సంభాషణల సారాంశం. 

ఈ ఆడియో రికార్డు బయటకు లీక్ అయ్యి మంత్రి గంగుల కమలాకర్ చెవిలో పడటంతో ఆయన దానిని సిఎం కేసీఆర్‌కు అందజేసి కలెక్టర్ సర్పారాజ్‌పై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. జిల్లా కలెక్టరు, ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్న సర్పారాజ్ ప్రతిపక్షాలతో చేతులు కలిపి తనకు వ్యతిరేకంగా వ్యవహరించారని కనుక ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. అయితే తాను బండి సంజయ్ కుమార్‌తో ఫోన్లో మాట్లాడినది నిజమే కానీ తమ సంభాషణను ఎవరో ఎడిటింగ్ చేసి లేనిది ఉన్నట్లు భ్రమింపజేయాలని ప్రయత్నిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. 


Related Post